క‌మ‌ల్ - ప‌వ‌న్‌ ల‌పై కేజ్రీ క‌న్నేశాడా?

Update: 2017-09-24 09:04 GMT
అవినీతిపై పోరాటంగా మొద‌లుపెట్టిన ఆమ్ ఆద్మీ ఆ త‌ర్వాత పార్టీ రూపు సంత‌రించుకుని 2015లో జ‌రిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీని చావుదెబ్బ తీసి అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ ఎన్నిక‌ల్లో ఢిల్లీలో ఉన్నమొత్తం 70 స్థానాల్లో 67 స్థానాల‌ను గెలుచుకుని బీజేపీని ఊడ్చిపారేసింది. ఆ త‌ర్వాత ఈ ఏడాది ఎన్నిక‌లు జ‌రిగిన‌ పంజాబ్‌లోనూ అధికారం దిశ‌గా సాగినా.. ఢిల్లీ మ్యాజిక్‌ ను రిపీట్ చేయ‌లేక‌పోయింది. ఇక్క‌డ 115 సీట్ల‌లో పోటీ చేసి కేవ‌లం 20 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ఆ త‌ర్వాత గోవా ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఒక్క సీటూ ద‌క్కించుకోలేక‌పోయింది. అయితే గోవాలో దాదాపు 6.5 శాతం సీట్లు సాధించింది. 2019లో జ‌ర‌గ‌నున్న‌సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లోపు దేశ‌మంతా బ‌ల‌ప‌డాల‌ని భావిస్తోంది. ముఖ్యంగా ద‌క్షిణ భార‌త‌దేశంలో ఆమ్ఆద్మీ పార్టీకి అంత‌గా పేరు కూడా లేదు. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణ భార‌త‌దేశంలో కూడా త‌న స‌త్తాను చాటాల‌ని ఆలోచ‌న‌లు చేస్తోంది.

ఈ క్ర‌మంలోనే రెండు రోజుల కింద‌ట విభిన్న న‌టుడు - త‌మిళ‌నాడుకు చెందిన క‌మ‌ల్ హాస‌న్‌ ను క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపార‌ట ఢిల్లీ ముఖ్య‌మంత్రి - ఆమ్ ఆద్మీక‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్‌. దసరా నాటికి కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన " భారతీయుడు " కూడా తన రాజకీయ ఆరంగేట్రం మీద ఇదమిత్థంగా ఇంకా ఏమీ తేల్చుకోలేదు. దీంతో క‌మ‌ల్‌ తో మాటామంతీ జరిపి.. ఆమ్ ఆద్మీలోకి ఆహ్వానించార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చివ‌ర‌కు క‌మ‌ల్ ఏం చెప్పారో తెలియ‌దు కానీ అవినీతి మీద మాత్రం కలిసికట్టుగా పోరాటం చేస్తామ‌ని ఇద్ద‌రి నుంచి సంయుక్త ప్రకటన వెలువడింది. క‌మ‌ల్‌ తోనే కాకుండా మ‌రో ప్ర‌ముఖ న‌టుడు ర‌జినీకాంత్‌ ను కూడా ఆమ్ ఆద్మీలోకి ఆహ్వానించే యోచ‌న‌లో ఉన్నార‌ట కేజ్రీవాల్‌. క‌మ‌ల్ - ర‌జినీల‌ను త‌మ పార్టీలోకి ఆక‌ర్షిస్తే త‌న పార్టీ ద‌క్షిణాదిలో కాలుపెట్టిన‌ట్టేన‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ రెండు క‌త్తులు ఒకే ఒర‌లో ఇమిడే అవ‌కాశం ఏ మాత్రం లేద‌న్న‌ది వేరే విష‌యం.

మ‌రోవైపు ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ ప్యాకేజీని పాచిపోయిన లడ్డూల‌ని పేర్కొని - ఆ పార్టీ మీద ఒంటి కాలితో లేస్తున్న ప్ర‌ముఖ సినీన‌టుడు - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కేజ్రీవాల్ క‌న్నుప‌డింద‌ట‌. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న‌ను కూర‌లో క‌రివేపాకులో వాడుకుని వ‌దిలేశార‌ని బీజేపీపై ర‌గులుతున్న‌ప‌వ‌న్‌ను ఆక‌ర్షిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోనూ ఆమ్ఆద్మీ వేళ్లూనుకునే అవ‌కాశం ఉంద‌ని కేజ్రీవాల్ భావిస్తున్న‌ట్లు వార్త‌లు గుప్పుమంటున్నాయి. అయితే ఏ విష‌యం మీద క్లారిటీతో మాట్లాడ‌కుండా చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లో మాత్ర‌మే న‌డుస్తాడ‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న జ‌న‌సేనాని ఆమ్ఆద్మీతో పొత్తుకు సై అంటాడా అంటే కాల‌మే దీనికి స‌మాధానం చెప్పాలి.


Tags:    

Similar News