టీమిండియాను కోలుకోలేని 'దెబ్బ' తీసిందిగా..!

Update: 2021-01-15 06:53 GMT
సహజంగా ఏ జట్టు విదేశీ టూర్ కు వెళ్లినా.. ఆతిథ్య దేశానికి చెందిన 'ఏ' టీంతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. కానీ.. ఆసీస్ పర్యటనలో సీన్ రివర్స్ అయ్యిందా? ఆస్ట్రేలియా జట్టుతో మన ‘ఏ’ టీం పోటీపడుతోందా? అన్నట్టుగా ఉంది పరిస్థితి! బ్రిస్బేన్లో నాలుగో టెస్టుకు బరిలోకి దిగబోతున్న టీమిండియా జట్టును పరిశీలిస్తే ఇలాంటి సందేహమే వస్తుంది.

భారత పేస్ ద‌ళం మొత్తం అనుభ‌వం కలిపితే ఐదారు టెస్టుల ఎక్స్ పీరియన్స్ కూడా లేదు! బౌలర్లలో ఇద్దరు ఈ టూర్లో ఎంట్రీ ఇచ్చినోళ్లే! ఇక బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఇలాగే ఉంది. ముగ్గురు ఆట‌గాళ్ల కిట్లో పది టెస్టుల ఎక్స్ పీరియన్స్ కూడా లేదు. అంటే.. వీళ్లంతా ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనుభవంతోనే బరిలోకి దిగారన్నమాట.

ఇంకా క్లారిటీగా చెప్పుకుంటే.. త‌మిళ‌నాడు బౌల‌ర్లు న‌ట‌రాజ‌న్, వాషింగ్ట‌న్ సుంద‌ర్ టెస్టు క్యాప్ ను ఇప్పుడే ధ‌రించారు. వీరిలో సుంద‌ర్ కు కొంత ఫ‌స్ట్ క్లాస్ అనుభ‌వం ఉన్నా, న‌ట‌రాజ‌న్ కు ఆ ఫ‌స్ట్ క్లాస్ ఎక్స్ పీరియన్స్ కూడా లేదు. నెట్ ప్రాక్టీస్ కోసం అన్నట్టుగా ఆసీస్ బయలుదేరిన ఈ ఐపీఎల్ స్టార్.. వ‌రు‌స‌గా టీ20, వ‌న్డే, టెస్టు ఆరంగేట్రాల‌ను కూడా పూర్తి చేశాడంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు భారత పేస్ విభాగానికి నాయకత్వం వహించేది ఎవరంటే.. ఈ టూర్లోనే టెస్ట్ ఆరంగేట్రం చేసిన మ‌హ్మ‌ద్ సిరాజ్! అతడే ఇప్పుడు ప్ర‌ధాన పేస‌ర్. ఇక శార్దూల్ ఠాకూర్, న‌వదీప్ సైనీకి ఎంత అనుభ‌వం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విధంగా టీమిండియా-ఏ జ‌ట్టుకు కూడా ఆడిన అనుభ‌వం పెద్ద‌గాలేని ఐదుగురు.. భారత జట్టు ప్ర‌ధాన‌బౌల‌ర్లుగా ఉన్నారు నాలుగో టెస్టులో.

ఇక బ్యాటింగ్ లైనప్ చూస్తే.. వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఈ మ్యాచ్ తోనే టెస్టు అరంగేట్రం చేశాడు. శుభ్ మ‌న్ గిల్ కు ఇది మూడో టెస్టు. మ‌యాంక్ అగ‌ర్వాల్ కిట్ లో పది పన్నెండు టెస్టుల అనుభవం మాత్రమే ఉంది. ఫైనల్ గా బ్రిస్బేన్ టెస్టులో సీనియ‌ర్లు ఎవ‌రంటే.. రోహిత్ శ‌ర్మ‌, పుజారా, ర‌హ‌నే, పంత్ మాత్రమే అన్నమాట.

దెబ్బలు టీమిండియాను ఇంతగా దెబ్బతీశాయి. కీల‌క ఆట‌గాళ్లు ఒక్కొక్క‌రుగా గాయాలపాలై ఈ మ్యాచ్ కు దూరమయ్యారు. టీ20, వ‌న్డే సిరీస్ లు పూర్తికాగానే.. పరిమిత ఓవర్ల స్పెష‌లిస్టుల‌ను ఇంటికి పంపించేశారు. దీంతో.. మిగిలిన కొత్త పిలగాళ్లతోటే నాలుగో టెస్టు సమరంలోకి దిగాల్సిన పరిస్థితి తలెత్తింది.

అయితే.. అనుభవం లేకున్నా తమదైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు కొత్త బౌల‌ర్లు. ఆస్ట్రేలియ‌న్ బ్యాట్స్ మెన్ ను అంత ఈజీగా పిచ్ పై పరిగెత్తే ఛాన్స్ ఇవ్వట్లేదు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ టెస్టుల్లో త‌న తొలి వికెట్ తీశాడు. స్టీవ్ స్మిత్ ను ఔట్ చేసి.. ఘ‌నంగా ఖాతా తెరిచాడు. మరి, ఈ జోరు ఇలాగే కంటిన్యూ అవుతుందా? బ్రిస్బేన్ టెస్టులో అద్భుతం జరుగుతుందా? లేక టీమిండియా నిజంగానే 'ఏ'జట్టుతో బరిలోకి దిగిందనే మాట నిజమవుతుందా? అనేది చూడాలి.
Tags:    

Similar News