ట్రంప్ మీద క‌స్సుమ‌న్న అస‌ద్‌

Update: 2017-12-16 10:10 GMT
ఎక్క‌డ హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ.. ఎక్క‌డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. అది కూడా శుక్ర‌వారం రాత్రి ప‌ది గంట‌ల వేళ‌లో పాత‌బ‌స్తీలో మొద‌లైన స‌భ అర్థ‌రాత్రి ఒంటిగంట వ‌ర‌కూ సాగింది. రాత్రి ప‌ద‌కొండు అయితే షాపు  లైటు వెలుగుతుంటేనే క‌సిరి.. లోప‌లేస్తాం బిడ్డా అంటూ బెదిరించే పోలీసులు.. మ‌రి పాత‌బ‌స్తీలో అర్థ‌రాత్రి ఒంటిగంట వ‌ర‌కూ పొలిటిక‌ల్ మీటింగ్‌ కు ఎలా ప‌ర్మిష‌న్ ఇస్తారో అర్థం కాని ప‌రిస్థితి.

మీటింగ్ పెట్టినోడు మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ కావ‌టంతో ఎవ‌రూ ఏమీ అన‌లేని ప‌రిస్థితి. నిజానికి ఈ స‌మావేశ‌మే కాదు.. మ‌జ్లిస్ పార్టీ పెట్టే ఏ ప‌బ్లిక్ మీటింగ్ అయినా స‌రే అర్థ‌రాత్రి దాటాల్సిందే.  తాజాగా నిర్వ‌హించిన మీటింగ్ లో అస‌దుద్దీన్ ఓవైసీకి కోపం వ‌చ్చేసింది. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మీద నిప్పులు చెరిగారు. ప‌నిలోప‌నిగా కొన్నింటిని కేంద్ర స‌ర్కారు మీద కూడా విసిరారు.

ఇంత‌కీ అస‌ద్‌ కు అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే.. ఈ మ‌ధ్య‌న అగ్ర‌రాజ్య‌మైన అమెరికా.. ఇజ్రాయెల్ వ్య‌వ‌హారంలో కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. జెరూస‌లెం న‌గ‌రాన్ని ఇజ్రాయెల్ రాజ‌ధానిగా అమెరికా గుర్తిస్తున్న‌ట్లుగా ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై అస‌ద్ తీవ్రంగా మండిప‌డ్డారు.

ట్రంప్ ప్ర‌క‌ట‌న ఒప్పందాల ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంద‌ని.. త‌క్ష‌ణ‌మే ఆయ‌న త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటే మంచిద‌న్నారు. ఈ అంశంపై అర‌బ్‌.. ముస్లిం దేశాలు మౌనంగా ఉండ‌టం మంచిది కాద‌న్న ఆయ‌న‌.. ఇలాంటి వేళ పాల‌స్తీనాకు మ‌ద్ద‌తుగా భార‌త్ నిల‌వాల్సి ఉంద‌న్నారు.

ప‌విత్ర‌మైన జెరుస‌లెం న‌గ‌రాన్ని పాల‌స్తీనా రాజ‌ధానిగా గుర్తించాల‌ని ఓవైసీ కోరారు. ఈ సంద‌ర్భంగా గాంధీ చెప్పిన మాట‌ల్ని ఉటంకించిన అస‌ద్‌.. ఫ్రెంచ్ వాళ్లు ఎలా అయితే ఫ్రాన్స్ కు చెందుతారో.. పాల‌స్తీనీయులు కూడా పాల‌స్తీనాకే చెందుతార‌న్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఇజ్రాయెల్ నుంచి ఆయుధాల కొనుగోలు నిలిపివేయాల‌ని మోడీ స‌ర్కారును కోరారు. పాల‌స్తీనా విష‌యంలో త‌ట‌స్థ వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించాల‌న్న కేంద్రం తీరును అస‌ద్ త‌ప్పు ప‌ట్టారు. జ‌న‌వ‌రిలో భార‌త్‌కు ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజిమిన్ ప‌ర్య‌ట‌న‌ను అస‌ద్ త‌ప్పు ప‌ట్టారు. ఈ విష‌యంలో కేంద్రం పున‌రాలోచ‌న చేయాల‌ని డిమాండ్ చేశారు. అస‌ద్‌కు ఉన్న రాజ‌కీయ లెక్క‌లు.. కేంద్రంలో కూర్చున్న మోడీకి ఉండ‌వా? ఏమైనా పాత‌బ‌స్తీలో అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌పై అర్థ‌రాత్రి వేళ అస‌ద్ ఆవేశంగా ప్ర‌సంగించ‌టం వెనుక లాజిక్కు ఇప్ప‌టికే అర్థ‌మైపోయిందా?
Tags:    

Similar News