నిండా 20 ఏళ్లు లేని కుర్రాళ్లు.. 7వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు..

Update: 2022-09-23 16:06 GMT
వారిద్దరికీ నిండా 20 ఏళ్లు కూడా లేవు. కానీ అద్భుతాన్ని సృష్టించారు. ఏకంగా 7 వేల కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పారు.  చదువు కూడా మధ్యలో వదిలేసి వారికి తట్టిన ఐడియా వారి జీవితాలను మార్చేసింది. 20 ఏళ్ల కుర్రాళ్లే ఇప్పుడు బడా కంపెనీల నుంచి వచ్చే ఉద్యోగులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇది చూసి వచ్చిన నిపుణులే ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది.

19 ఏళ్ల భారతీయ కుర్రాళ్లిద్దరూ ఏడాదిలోనే ఏకంగా రూ.7వేల కోట్లకు పైగా విలువైన కంపెనీని సృష్టించి సంచలనం రేపారు. వెయ్యి కోట్ల సంపద కూడబెట్టి తాజాగా భారత్ లో బిలియనీర్ల క్లబ్ లో చేరిన అత్యంత పిన్న వయస్కులయ్యారు.

కైవల్య వోహ్రా, ఆదిత్ పలీచా.. ఈ ఇద్దరు కుర్రాళ్లు పెట్టిన కంపెనీ ‘జెప్టో’. అంటే దీని అర్థం ‘చిటికె వేసం కాలం’. అయితే ఆ అర్థంతోనే అతి తక్కువ సమయంలో ఇంటికి కిరాణా, ఇతరత్రా సామాగ్రిని అందించే ఈ కంపెనీని స్తాపించారు. కరోనా సమయంలో పడ్డ ఇబ్బందులతో వీరికి వచ్చే ఆలోచనే ‘జెప్టో’ కంపెనీగా మారింది. వారిని వేల కోట్లకు అధిపతిని చేసింది.

స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువును మధ్యలోనే ఆపేసిన వీరిద్దరూ  భారత్ కు తిరిగి వచ్చి స్తాపించిన కంపెనీయే ఇది. 2020లో కరోనా లాక్ డౌన్ వేళ ముంబయి కిరాయి అపార్ట్ మెంట్ లో ఉన్న వీరిద్దరూ నిత్యావసరాలకు ఇబ్బంది పడ్డారు. జనాలలాగానే చుక్కలు చూశారు. ఈ క్రమంలోనే ‘కైవల్య’ తొలుత ‘కిరాణా మార్ట్’ పేరుతో ఈ స్టార్టప్ ప్రారంభించాడు. తర్వాత అదిత్ చేరాడు. స్తానిక కిరాణా దుకాణాలతో ఒప్పందం కుదుర్చుకొని తక్షణమే ఇళ్లకు సామగ్రిని అందించడం మొదలుపెట్టారు. కంపెనీ కార్యకలాపాలను తొలుత తమపై తామే ప్రయోగాలు చేసుకున్నారు. ఆ అనుభవాలతో సరిదిద్దుకుంటూ వెళ్లారు.

2021 ఏప్రిల్ లో ముంబైలో రూ.485.3 కోట్ల ఆరంభ ఫండింగ్ ను ఆకర్షించి కార్యకలాపాలు ఆరంభించిన కంపెనీ ఇప్పుడు పదికిపైగా పట్టణాల్లో సుమారు 1500 మంది సిబ్బందితో విస్తరించి సేవలందిస్తోంది. ఈ కుర్రాళ్లిద్దరూ చొరవ, ఆలోచన, ప్రజల అవసరాలు తీరుస్తున్న వైనమే వారి గెలుపునకు సోపానం అయ్యింది. ఇప్పుడు వీరి కంపెనీ 7వేల కోట్లు విలువ కాగా.. కైవల్య సంపద రూ.1000 కోట్లుగా.. అదిత్ సంపద రూ.1200 కోట్లుగా తేలింది.

జెప్టో స్టార్టప్ నెల తిరిగే సరికే రూ.800 కోట్లకు పడగలెత్తింది. ఈ ఏడాది మేలో రూ.1617 కోట్లు వచ్చాయి. కంపెనీ విలువ రూ.7వేల కోట్లకు పైగా చేరింది. కిరాణా సామాగ్రితోపాటు కాఫీ, టీ, చిరుతిళ్లు లాంటివి కూడా అందించేందుకు ప్రయత్నిస్తూ అటు ప్రజలకు వేగంగా.. ఇటు వ్యాపారులకు లాభంగా మారిన ఈ సంస్థకు అంకురార్పణ చేసింది ఇద్దరు నిండా 20 ఏళ్లు లేని కుర్రాళ్లు కావడం విశేషం. వీరికి తోడుగా 9 మందిని సమర్థులైన నిపుణులను అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఇన్ఫోసిస్ ల నుంచి తీసుకొచ్చారు. అంతపెద్ద వారిని ఈ 20 ఏళ్లలోపు వారి ఇంటర్వ్యూ చేసి నడిపిస్తుండడం నిజంగా విశేషమే. ప్రతిభ ఉంటే సాధించనది ఏదీ లేదని ఈ కుర్రాళ్లు నిరూపించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News