మంత్రి అచ్చెన్నా.. మాట మార్చ‌డంలో దిట్ట‌న్నా!

Update: 2016-10-17 10:50 GMT
ఏపీలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు రాజ‌కీయాల‌ను బాగా ఒంట‌బ‌ట్టించుకున్న‌ట్టున్నారు. కేవ‌లం 24 గంట‌ల్లోనే తాను అన్న మాట‌కు రివ‌ర్స్ అయిపోయారు. అబ్బెబ్బే.. నేన‌లా అన‌లేదు.. మీడియా వ‌క్రీక‌రించింది! వంటి డైలాగుల‌ను వ‌ల్లించేస్తున్నారు. దీంతో నివ్వెర‌పోవ‌డం జ‌నాలు, మీడియా  వంతైంది! ఇక‌, విష‌యంలోకి వెళ్లిపోతే.. 2014 ఎన్నిక‌లకు ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఓట‌ర్ల‌కు అనేక హామీలు గుప్పించారు. వాటిలో ముఖ్య‌మైంది నిరుద్యోగ భృతి. తాము అధికారంలోకి వ‌స్తే.. ఉద్యోగ క‌ల్ప‌న చేస్తామ‌ని, ఒక‌వేళ‌.. ఉద్యోగ క‌ల్ప‌న చేయ‌లేక‌పోతే.. అప్ప‌టి వ‌ర‌కు నిరుద్యోగుల‌కు నెల‌నెలా భృతి క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు.

అయితే, అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు పూర్త‌వుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ హామీపై చంద్ర‌బాబు కానీ, ఆయ‌న మంత్రి వ‌ర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ దృష్టి పెట్ల‌లేదు. అయితే, ఆదివారం వెల‌గ‌పూడిలోని కొత్త స‌చివాల‌యంలో కార్మిక శాఖ మంత్రికి కేటాయించిన త‌న ఛాంబ‌ర్‌ను ప్రారంభించిన సంద‌ర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో పిచ్చ‌పాటిగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌ను ఏక‌రువు పెట్టారు. ఇంత‌లో ఓ విలేక‌రి నిరుద్యోగ భృతి అంశాన్ని ప్ర‌శ్నించాడు. దీనికి స్పందించిన మంత్రి అచ్చెన్న‌.. నిరుద్యోగ భృతి ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని స్ప‌ష్టం చేసేశారు.

నిరుద్యోగ భృతి ఇస్తున్న రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అధ్యయనం చేశామని.. చాలా తక్కువ మొత్తాన్ని ఇస్తున్నట్లుగా గుర్తించినట్లు చెప్పిన ఆయన.. ఏపీలో అలాంటి హామీ అమలు చేయలేమని చెప్పేశారు. దీనిని కొన్ని మీడియా సంస్థ‌లు పెద్ద ఎత్తున ప్ర‌చురించాయి. ఈ ప‌రిణామంతో నిరుద్యోగుల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని గ్ర‌హించిన మంత్రి అచ్చెన్న ఒక్క‌సారిగా ప్లేట్ ఫిరాయించారు. సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. తాను అలా అన‌లేద‌ని, మీడియా అలా అర్ధం చేసుకుంద‌ని మాట మార్చారు. నిరుద్యోగ భృతి ఇవ్వ‌లేమ‌ని తాను ఎప్పుడూ చెప్ప‌లేద‌న్నారు.

అస‌లు నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారు?  వారికి భృతి ఎలా ఇవ్వాలి? ఎంత మొత్తం ఇవ్వాలి? అనే అంశాల‌పై అధ్య‌య‌నం చేయిస్తున్న‌ట్టు తెలిపారు. నిరుద్యోగ భృతి ఇవ్వకూడదని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు. చంద్రన్న బీమా పథకం ద్వారా 2 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఇందులో లక్షలాది మంది నిరుద్యోగులూ భాగమయ్యారని వివ‌రించారు. మొత్తానికి.. ఇలా ఒక్క‌రోజులోనే కాదు కాదు.. ఒక్క‌రాత్రిలోనే అచ్చెన్న భ‌లే మాట మార్చేశారే అని ప‌లువురు ఆయ‌న‌పై సెటైర్లు పేలుస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News