దివంగత నేత కాదు.. దివంగత మేతంట

Update: 2015-03-18 07:03 GMT
ఏపీ అసెంబ్లీ రచ్చ.. రచ్చగా సాగుతోంది. అధికారపక్షంపై విపక్షం ఆరోపణల దాడి చేస్తే.. విపక్షంపై అధికారపక్షం మాటల దాడి చేస్తోంది. సభలో లేని వ్యక్తిని నిందించటం సరికాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పలుమార్లు చెప్పటం తెలిసిందే.

అయినప్పటికీ.. గత పాలకులు చేసిన తప్పుల్ని ప్రస్తావించే క్రమంలో విపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రస్తావన రాకుండా ఉండని పరిస్థితి. అయితే.. వైఎస్‌ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ అధికారపక్షం నేతలు.. దోచుకున్నారు.. మూటలు కొట్టుకున్నారు.. కొల్లగొట్టారు లాంటి పదాలు వినియోగిస్తే.. వాటికి కౌంటర్‌గా.. జగన్‌ మాత్రం ఆ మహానేత.. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు అంటూ గౌరవంగా సంబోధించటం తెలిసిందే.

తండ్రి అన్న తర్వాత ఆమాత్రం ప్రేమాభిమానాలు ప్రదర్శించటం తప్పేం కాదు. కానీ.. ప్రతిసారి దివంగతనేత అంటూ ప్రస్తావిస్తున్న వైనాన్ని తప్పు పడుతూ.. అధికారపక్షం నేతలు కాస్తంత తీవ్రమైన వ్యాఖ్య చేశారు.

ఏపీ అధికారపక్ష ఫైర్‌ బ్రాండ్‌ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. జగన్‌ ప్రతిసారీ దివంగత నేత.. దివంగత నేత అంటూ పదేపదే ప్రస్తావిస్తుంటారని.. కానీ.. వైఎస్‌ను దివంగత నేత కాదు.. దివంగత మేత అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు..పదే పదే దివంగత నేత అని పలకకూడదని రూలింగ్‌ ఇవ్వకూడదని స్పీకర్‌ను కోరారు. దీనికి విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎంత రాజకీయ శత్రుత్వం ఉన్నా.. మరణించిన వారిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అంత మంచిది కాదు. అంతేకాదు.. ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించే సమయంలో అతని గొప్పతనాన్ని కీర్తించకూడదంటూ రూలింగ్‌ ఇవ్వమని ఏపీ అధికారపక్షం ఎలా డిమాండ్‌ చేయగలదు..?
Tags:    

Similar News