అచ్చెన్నాయుడిని పరుగెత్తించిన బీకాం ఫిజిక్స్‌

Update: 2017-04-03 06:10 GMT
చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ దెబ్బకు టీడీపీలో అసమ్మతి పీక్ స్టేజికి చేరింది. ఈ క్రమంలో అసంతృప్తులను బుజ్జగించే పనులను కొందరు మంత్రులకు అప్పగించారు. వారిలో కొందరు తమకు అప్పగించిన కేండిడేట్లనే కాకుండా ఎక్కడ ఎవరైనా ఏమైనా చేస్తున్నారంటే చంద్రబాబు చెప్పకపోయినా స్వయంగా స్పందించి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం నుంచి తాజా అసంతృప్తుల వరకు ఎందరినో బుజ్జగించే పని భుజానికెత్తుకున్న అచ్చెన్నాయుడైతే పాపం ఈ పనిలో చాలా బిజీగా మారిపోయారు. అలాంటి అచ్చెన్నను ఈ రోజు ఉదయం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పరుగులు తీయించారు.
    
జలీల్ ఖాన్ ఈ రోజు పొద్దున్నే కార్యకర్తలతో సమావేశం కావడం.. ఆ సమాచారం ఎలాగోలా అచ్చెన్నకు అందడం జరిగాయి. ఇంకేముంది.. అసలే అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే కావడంతో కార్యకర్తలతో మీట్ అయి ఏ నిర్ణయం తీసుకుంటారో అని అచ్చెన్న టెన్షన్ పడి మరో మంత్రి దేవినేని ఉమాకు ఫోన్ చేశారు. ఆయన్ను కూడా నిద్రలేపి ఇద్దరూ పరుగుపరుగున జలీల్ ఖాన్ వద్దకు వెళ్లారట.  ముస్లిం నేతలతో సమావేశమైన జలీల్ ను మంత్రులిద్దరు సముదాయించారు.
    
స్థానిక ముస్లిం నేతలతో పాటు - రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేతలంతా తన రాజీనామాకు పట్టుబడుతున్నారని ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మంత్రులకు తెలిపారు. ఈలోగా కృష్ణా జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు - కేంద్ర మంత్రి సుజనా చౌదరిలతోనూ జలీల్ కు ఫోన్ చేయించారు.  తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పిన మంత్రులు - మంత్రి వర్గంలో చోటు దక్కని కారణాన్ని జలీల్ కు వివరించే ప్రయత్నం చేశారు. తాను పార్టీని వీడబోనని, అయితే, 12 శాతం ఉన్న ముస్లిం జనాభాకు తగు న్యాయం చేసి వుండాల్సిందని ఈ సందర్భంగా జలీల్ వ్యాఖ్యానించారు. తాను రాజీనామా చేయడం లేదని ఆయన మంత్రులకు హామీ ఇవ్వడంతో, మంత్రులు వెళ్లిపోయారు. మొత్తానికి జలీల్ అచ్చెన్నను బాగానే పరుగులు పెట్టించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News