ఆత్మకూరు ఉప ఎన్నిక.. పోటీలో 15 మంది!

Update: 2022-06-08 03:28 GMT
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నికలో మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ తెలిపారు. ఆత్మకూరులోని ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల సమక్షంలో అన్ని నామినేషన్‌ పత్రాలను ఆయన పరిశీలించారు. ఈ పరిశీలనలో వివిధ కారణాలతో 13 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. మొత్తం 15 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదిస్తున్నట్లు చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. అనంతరం పోటీ చేసే చివరి అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.

వైఎస్సార్సీసీపీ తరఫున దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ తరఫున గుండ్లపల్లి భరత్‌ కుమార్‌, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున నందా ఓబులేషులతో పాటు పలువురు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఉప ఎన్నికలో పోటీ పడుతున్నారు. కాగా టీడీపీ, జనసేన ఈ ఎన్నికలో పోటీ చేయడం లేదు. గౌతమ్ రెడ్డిపై గౌరవంతో పోటీకి దూరంగా ఉంటున్నాయని ప్రకటించాయి.

కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జూన్ 1న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలసిన మేకపాటి విక్రమ్ రెడ్డి ఆయన చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. జూన్ 2న రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వెంట రాగా విక్రమ్ రెడ్డి నెల్లూరులో నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా జూన్ 23న పోలింగ్ జరగనుంది. జూన్ 26న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం ఎన్నికల ప్రక్రియను జూన్ 28లోగా పూర్తి చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

మరోవైపు టీడీపీ, జనసేన తమ అభ్యర్థులు పోటీలో ఉండరని ప్రకటించిన నేపథ్యంలో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకేనని అని చెప్పవచ్చు. మెజారిటీ ఎంత వస్తుందనేది కీలకం.

అయితే మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో లక్షకు పైగా భారీ మెజారిటీ సాధించి తమ సత్తా చాటాలని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. తద్వారా మేకపాటి గౌతమ్ రెడ్డికి సరైన నివాళి ఇస్తామని చెబుతోంది. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రజల మద్దతు వైఎస్సార్సీపీకే ఉందని చెప్పుకోవడానికి మొగ్గుచూపుతోంది. ఇప్పటికే ఈ దిశగా వైఎస్సార్సీపీ అధిష్టానం నెల్లూరు జిల్లా పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నిక జరిగితే వైఎస్సార్సీపీ గెలుపొందితే తమపై వ్యతిరేతక ఏమాత్రం లేదని చెప్పుకుంటుందని అంటున్నారు. అందుకే భారీ విజయం సాధించామని.. ఈ విజయం వచ్చే ఎన్నికలకు సంకేతమని ఆ పార్టీ చెప్పుకునే వీలుంటుందని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News