ఆత్మనిర్భర్ భారత్‌ .. 'ఎమ్‌పీఏటీజీఎమ్' క్షిపణి ప్రయోగం విజయవంతం !

Update: 2021-07-22 04:25 GMT
ఆత్మనిర్భర్ భారత్‌ సాధించే దిశగా భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ (డీఆర్‌ డీఓ) మరో కీలక ముందడుగు వేసింది. శత్రుదేశ యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేసే ఎమ్‌ పీఏటీజీఎమ్ (మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్) క్షిపణిని బుధవారం  విజయవంతంగా ప్రయోగించి , విజయం సాధించింది. రాబోయే రోజుల్లో రక్షణ రంగానికి సంబంధించిన అవసరాలను దేశీయంగానే తీర్చుకోవాలన్న లక్ష్యంతో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ విధానం వేగంగా అమలు అవుతోంది. ఇందులో భాగంగానే తాజాగా డీఆర్‌ డీఓ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ప్రయోగం చేపట్టింది.

మ్యాన్ పోర్టబుల్ లాంచర్ ద్వారా ప్రయోగించిన ఈ క్షిపణి నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌ డీఓ  అధికారికవర్గాలు వెల్లడించాయి. సమీపంలోని లక్ష్యాలను క్షిపణి కచ్చితంగా ఛేదించగలదని ఈ ప్రయోగంలో రుజువైందని తెలిపాయి. ఇక సుదూర టార్గెట్లకు సంబంధించి గతంలో జరిగిన పరీక్షలు విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ మిస్సైల్‌లో అత్యాధునిక ఇన్‌ ఫ్రా రెడ్ సీకర్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉన్నాయని డీఆర్‌ డీఓ తెలియజేసింది.

ఈ ప్రయోగం ద్వారా దేశీయ క్షిపణి సైనిక శక్తి మరింత పటిష్టమవుతుందని డీఆర్‌ డీఓ తెలిపింది. ఈ క్షిపణి గరిష్ఠ పరిధిలో ఇప్పటికే విజయవంతంగా పరీక్షించగా, కనిష్ఠ పరిధిలో చేపట్టిన ప్రస్తుత పరీక్ష కూడా విజయవంతమైంది. యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌ గరిష్ఠ పరిధి 2.5 కిలోమీటర్లు. ఇది 15 కిలోల బరువు ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా మోసుకెళ్లేలా డీఆర్‌ డీఓ రూపొందించింది.

ఇదిలా ఉంటే గత ఏడాది సెప్టెంబర్ లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లేజర్‌ ఆధారిత ట్యాంకు విధ్వంసక క్షిపణి (ఏటీజీఎం)ని భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌ ఆర్మర్డ్‌ కోర్‌ సెంటర్‌ అండ్‌ స్కూల్‌(ఏసీసీఖీఎస్‌)లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌ డీఓ) ఈ ప్రయోగాన్ని చేపట్టి , విజయం సాధించింది.   దాదాపు నాలుగు కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇది కచ్చితత్వంతో ఛేదిస్తుంది. లేజర్-గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి (ఏటీజీఎం) ముఖ్యంగా పాకిస్తాన్ మరియు చైనా సరిహద్దులతో పాటు భారత సైన్యం శక్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాత్రివేళ కూడా లక్ష్యాలను చేరుకునేలా దేశీయంగా అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణి సిద్ధమైంది. ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించేలా రూపొందించిన ఈ అణు సామర్థ్య క్షిపణిని డీఆర్‌ డీవో రాత్రి పూట పరీక్షించింది. లక్ష్యంగా ఎంపికచేసుకున్న యుద్ధ ట్యాంకు రక్షణ కవచాన్ని తునాతునకలు చేసేందుకు హై స్పీడ్‌ ఎక్స్‌పెండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌ (హీట్‌) పరిజ్ఞానంతో అభివృద్ధిచేసిన వార్‌ హెడ్‌ ను ఇందులో అమర్చే వెసులుబాటు ఉంది. వేర్వేరు ప్రదేశాల నుంచీ పరీక్షించేందుకు అనువుగా దీన్ని తయారుచేశామని అధికారులు తెలిపారు.

కరోనాపై పోరుకు డీఆర్‌ డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) . పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల..వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్‌డీఓ వివరించింది. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పొడిని తయారు చేసింది. దీనిని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని  భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌ డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌  ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌ లో వెల్లడైంది. గత నెల చివర్లో ఈ వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి వచ్చింది.
Tags:    

Similar News