అయ్య‌న్న నోట‌!... గంటా అవినీతి చిట్టా!

Update: 2018-04-09 09:55 GMT
వారిద్ద‌రూ టీడీపీ నేత‌లే. అంతేనా... ఇద్ద‌రూ చంద్ర‌బాబు కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రులే. అంతేకాదండోయ్ ఇద్ద‌రూ ఒకే జిల్లాకు చెందిన నేత‌లే. అయినా స‌రే వారిద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి. ఈ కార‌ణంగానే వారిద్ద‌రూ క‌లిసి క‌నిపించిన సంద‌ర్భాలు దాదాపుగా లేవ‌నే చెప్పాలి. వారు టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఏపీ కేబినెట్ లో ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా ఉన్న చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు - మ‌రో మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు. ఆది నుంచి కూడా రాజ‌కీయంగా బ‌ద్ధ శ‌త్రువులుగా మెల‌గుతున్న వీరిద్ద‌రి మ‌ధ్య మొన్నామ‌ధ్య‌ ఓ రెవెన్యూ డివిజ‌న‌ల్ అధికారి బ‌దిలీ విష‌యంలో మ‌రోమారు పంచాయ‌తీ రేగింది. ఆ పంచాయ‌తీ ఎంత‌దాకా వెళ్లిందంటే... ఒక‌రిపై ఒక‌రు బ‌హిరంగంగానే ఆరోప‌ణ‌లు చేసుకునేంత‌గా. పార్టీ అధినేత‌గానే కాకుండా ఏపీ ప్ర‌భుత్వ ర‌థ‌సార‌ధిగా ఉన్న చంద్ర‌బాబు రంగంలోకి దిగినా కూడా ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. పార్టీలో చంద్ర‌బాబు కంటే సీనియ‌ర్ గానే ఉన్న మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు బాణాల్లా వ‌దులుతున్న అస్త్రాల‌కు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ప‌డిపోగా... పార్టీ ప‌రువు నానాటికీ బ‌జారున ప‌డిపోతోంది.

ఇక తాజా వివాదం విష‌యానికి వ‌స్తే... తొలుత టీడీపీలోనే ఉన్న గంటా... మొన్నామ‌ధ్య చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీలోకి వెళ్లి, అటు నుంచి అటే కాంగ్రెస్‌ లోకి వెళ్లిపోయారు. మొన్న‌టి ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా తిరిగి త‌న సొంత గూటికి వ‌చ్చేశారు. ఈ క్ర‌మంలో విశాఖ జిల్లా నుంచే బ‌రిలోకి దిగిన గంటా - అయ్య‌న్న‌లు ఇద్ద‌రూ విజ‌యం సాధించారు. ఇద్ద‌రినీ చంద్ర‌బాబు త‌న కేబినెట్ లోకి తీసుకోక త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలో జిల్లాపై ప‌ట్టు సాధించేందుకు అయ్య‌న్న - గంటాలు ఒక‌రిపై ఒక‌రు దాదాపుగా యుద్ధం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో గంటా - ఆయ‌న అనుచ‌రులు పెద్ద ఎత్తున భూ దందాల‌కు పాల్పుడుతున్నార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన అయ్య‌న్న‌... గంటా భూ క‌బ్జాల‌కు సంబంధించిన కీల‌క ప‌త్రాల‌ను సంపాదించేశారు. వాటిని నేరుగా చంద్ర‌బాబుకు అంద‌జేయ‌డంతో పాటు విశాఖ భూ క‌బ్జాల‌పై ద‌ర్యాప్తున‌కు ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు సంస్థ (సిట్‌)కు కూడా అంద‌జేశారు. నాడు చంద్ర‌బాబు తలంటుతో కాస్తంత త‌గ్గిన గంటా... మ‌ళ్లీ త‌న దందాను కొన‌సాగించేందుకు రంగం సిద్ధం చేశార‌ట‌.

ఈ క్ర‌మంలో నిన్న మీడియా ముందుకు వ‌చ్చిన అయ్యన్న‌... మ‌రోమారు గంటా అవితీని తంతుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ డెయిరీకి చెందిన దాదాపు రూ.1,000 కోట్ల విలువున్న భూమిని కాజేసేందుకు గంటా ప‌క్కాగా ప్లాన్ చేశార‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ డెయిరీ పాల‌క‌వ‌ర్గ స‌మావేశాన్ని స్థానికంగా కాకుండా ఏ ఒక్క‌రికి తెలియ‌కుండా గుట్టు చ‌ప్పుడు కాకుండా గోవాలో నిర్వ‌హించిన గంటా... త‌న దందాకు ఎవ‌రూ అడ్డురాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని ఆరోపించారు. గంటాకు స‌హ‌క‌రిస్తున్న వ్య‌క్తి వేరెవ‌రో కాద‌ని - స్వ‌యంగా డెయిరీలో కీల‌క స్థానంలో ప‌నిచేస్తున్న సీనియ‌ర్ అధికారేన‌ని అయ్య‌న్న సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఇదే విష‌యంపై తాను గ‌తంలో చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేశాన‌ని, నాడు బాబు మంద‌లింపుతో త‌గ్గిన గంటా - ఇప్పుడు మ‌రోమారు విశాఖ డెయిరీ స్థ‌లాన్ని కాజేసేందుకు ప‌క్కా ప్లాన్‌ తో ముందుకు వెళుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. మొత్తంగా గంటా అవినీతిని చంద్ర‌బాబు కూడా నిలువ‌రించ‌లేక‌పోతున్నార‌న్న రీతిలో అయ్య‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేసిన విష‌యాన్ని కూడా అయ్య‌న్న బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌డంతో ఇప్పుడు ఈ వివాదం ఎంత‌దాకా వెళుతుందోన‌న్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Tags:    

Similar News