ఫోర్బ్స్ టెక్ టైకూన్ లిస్ట్‌లో ఇద్ద‌రు ఇండియ‌న్లు

Update: 2016-08-11 12:23 GMT
అమెరికాకు చెందిన ఫొర్బ్స్ మ్యాగ‌జైన్ ఇటీవ‌ల వెల్ల‌డించిన ప్ర‌పంచ‌ టెక్ టైకూన్ జాబితాలో ఇద్ద‌రు ఇండియ‌న్స్ మాత్ర‌మే చోటు సంపాదించుకున్నారు. ఈ మ్యాగ‌జైన్ ఇచ్చే టైకూన్ ర్యాంకింగ్‌కు ప్ర‌పంచంలో భ‌లే క్రేజ్ ఉంది. ఈ జాబితాలో తొలి 20 స్థానాల్లో నిల‌బ‌డేందుకు ఎంతో ప్ర‌య‌త్నించే దిగ్గ‌జాలు ఉన్నాయి. అంటే.. ప‌లు ప్ర‌పంచ సంస్థ‌ల దిగ్గ‌జాల మ‌ధ్య ఈ ఫొర్బ్స్ ర్యాంకింగ్ విష‌యంలో భారీ పోటీ ఉంటుంది.  ఇక‌, తాజాగా వెల్ల‌డించిన ర్యాంకుల్లో తొలి 20 మందిలో ఇద్ద‌రు భార‌తీయుల‌కు మాత్ర‌మే చోటు ల‌భించింది. సాంకేతికంగా ప్ర‌పంచాన్ని ముందుకు తీసుకెళ్తూ.. అప‌ర కుబేరులుగా ఎదిగిన‌ వారి జాబితాలో అజీం ప్రేమ్‌జీ, శివ‌నాడార్‌ మాత్ర‌మే భార‌త్ త‌ర‌ఫున ఎంపిక‌య్యారు.

ఇక‌, ఈ ఫోర్భ్స్ జాబితాలో తొలిస్థానాన్ని  మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 78 బిలియన్ డాలర్ల ఆస్తితో తొలి స్థానంలో నిలిచాడు. ఇక విప్రో చైర్మ‌న్ అజీం ప్రేమ్ జీ 16 బిలియన్ డాలర్ల ఆస్తులతో 13వ స్థానంలో, హెచ్ సీఎల్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ 11.6 బిలియన్ డాలర్ల ఆస్తితో 17వ స్థానంలోనూ నిలిచారు. ఈ జాబితాలో భారత సంతతి అమెరికన్లు రమేష్ వాద్వానీ (సింఫనీ సీఈఓ) భరత్ దేశాయ్ (సింటెల్ వ్యవస్థాపకుడు) దంపతులకూ కూడా స్థానం లభించింది. విప్రో చైర్మ‌న్ అయిన అజీం ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ దిగ్గ‌జం.. శివ‌నాడార్ ఇద్ద‌రూ సాంకేతిక రంగంలో యువ‌త‌ను భారీగా ప్రోత్స‌హిస్తున్నారు.

తన కుమారుడు రిషద్ ను సంస్థలో ఉన్నత పదవిలో కూర్చోబెట్టిన అజీం, అతడికి మరిన్ని బాధ్యతలు అప్పగించే ఉద్దేశంలో ఉన్నారని ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక‌, శివ‌నాడార్‌.. టాలెంట్ కేర్ పేరిట నూతన గ్రాడ్యుయేట్లలో నైపుణ్యాన్ని పెంచేలా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఫోర్బ్స్ తెలిపింది. నాడార్ తాజా వెంచర్ 500 మిలియన్ డాలర్ల ఫండ్ ను పలు స్టార్టప్ ల్లో, అమెరికా హెల్త్ కేర్ టెక్ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టు ఫోర్బ్స్ తెలిపింది. ఇక గూగుల్‌ అల్ఫాబెట్‌ ఛైర్మన్‌ ఎరిక్‌ ష్మిత్‌, ఉబర్‌ సీఈఓ ట్రావిస్‌ కలనిక్‌లు టాప్‌-20లో ఉన్నారు.

టాప్-100 టెక్ జెయింట్ల ఆస్తుల విలువ గత సంవత్సరంతో పోలిస్తే 6 శాతం పెరిగి 892 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ జాబితాలో సగానికి అమెరికాకు చెందిన వారే ఉండగా, టాప్-10లో ఎనిమిది మంది అమెరికన్లే కావడం గమనార్హం. ఆ తరువాతి స్థానంలో 19 మందితో చైనా నిలిచింది.
Tags:    

Similar News