రిపబ్లిక్ డే పరేడ్ లో బాహుబలి

Update: 2016-01-27 07:52 GMT
గత ఏడాది భారతదేశంలో తెగ ఆసక్తి రేపి... అంతేస్థాయిలో ఆకట్టుకున్న సినిమా బాహుబలి. ఇప్పటికీ బాహుబలి ప్రభావం ఇంకా వీడలేదు. బాహుబలి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. సినీ ప్రముఖులు - అభిమానుల మన్ననలు పొందింది. ఆ సినిమా స్ఫూర్తితో అందులోని స్టిల్స్ తో వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా అలాంటి విగ్రహాలు తయారుచేశారు. సోషల్ మీడియా కూడా బాహుబలి అని హోరెత్తిపోయింది. తాజాగా గణతంత్ర దినోత్సవంపైనా బాహుబలి ప్రభావం కనిపించింది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఓ వ్యక్తి బాహుబలిలోని ఓ స్టిల్ ను ప్రదర్శించారు. బాహుబలిలో ప్రభాస్ మాదిరిగా శివలింగాన్ని భుజానికెత్తుకుని బైక్ పై నిల్చుని తన విన్యాసాన్ని ప్రదర్శించగా అందరూ ఆకర్షితులయ్యారు. దీంతో మొత్తం రిపబ్లిక్ డే వేడుకలకే ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

రిపబ్లిక్ డే పరేడ్ లోనూ బాహుబలిలా విన్యాసాలు ప్రదర్శించడంతో ఆ సినిమా ఎంతగా ముద్ర వేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి ఇమేజిని ఎక్కడికో తీసుకెళ్లిన బాహుబలి తాజాగా ఆయనకు పద్మశ్రీ అవార్డునూ అందించింది. సుమారు 70 దేశాల్లో ప్రదర్శితమైన బాహుబలి గణతంత్ర సంబరాల్లోనూ చోటు దక్కించుకోవడం విశేషమే మరి.
Tags:    

Similar News