విరాట్ కోహ్లి వర్సెస్ కొంటాస్-ఆసీస్ మీడియా-ప్రేక్షకులు
చూస్తూ ఉంటే బోర్డర్ గావస్కర్ సిరీస్ ముగిసే సరికి టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటన 2008 నాటి పర్యటనలా వివాదాస్పదంగా మిగిలేలా కనిపిస్తోంది.
చూస్తూ ఉంటే బోర్డర్ గావస్కర్ సిరీస్ ముగిసే సరికి టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటన 2008 నాటి పర్యటనలా వివాదాస్పదంగా మిగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే మెల్ బోర్న్ లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా 19 ఏళ్ల ఓపెనర్ సామ్ కాన్ స్టాస్ మధ్య ‘ఢీ’ అంశం వేడి రాజేసింది. కోహ్లిపై టెస్టు నిషేధం వరకు వెళ్లినా.. చివరకు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాతో సరిపెట్టారు. కోహ్లి కావాలనే ఢీ కొట్టినట్లు సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. కానీ, ఇద్దరమూ భావోద్వేగానికి లోనయ్యామని కాన్ స్టాస్ చెప్పుకొచ్చాడు. “ఇది క్రికెట్‌లో సర్వసాధారణం. పెద్ద సమస్యగా భావించడం లేదు” అని తేల్చేశాడు. కోహ్లి వస్తున్నట్లు గమనించలేదని అందుకే ఈ ఘటన జరిగిందని చెప్పి వాతావరణాన్ని చల్లబరిచాడు.
ఆసీస్ మీడియా ఊరుకోదుగా..?
కోహ్లితో వివాదాన్ని పెద్దది కాకుండా కాన్ స్టాస్ వదిలేసినా.. ఆస్ట్రేలియా మీడియా మాత్రం నిప్పు రాజేస్తూనే ఉంది. ఓ పత్రిక కోహ్లి ఫోటో వేసి ‘క్లౌన్ కోహ్లీ’ (జోకర్ అనేలా) అని హెడ్డింగులు పెట్టింది. మరో పత్రిక సైతం ఇలానే బ్యానర్ వేసి ఎగతాళి చేసింది.
ప్రేక్షకులూ రెచ్చగొడుతూ..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ రెండో రోజు శుక్రవారం కోహ్లి ఫీల్డింగ్ చేస్తుండగా అతడిని ఉద్దేశించి అభిమానులు పెద్దగా అరిచారు. ఇక కోహ్లి ఔటై వస్తుండగా మరింతగా అవమానించారు. డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తుండగా కొంతమంది ఆసీస్ ఫ్యాన్స్ ఎగతాళి చేశారు. మాటలు, చేతలతో రెచ్చగొట్టారు. దీంతో కోహ్లి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెనక్కి వచ్చి వారిపైపు సీరియస్ గా చూశాడు. భద్రతాధికారి నచ్చజెప్పి లోపలికి తీసుకెళ్లాడు. ఆసీస్ అభిమానుల తీరును భారత స్టార్ పేసర్ బుమ్రా సతీమణి సంజనా గణేశన్ తీవ్రంగా ఖండించింది. ఓఅత్యుత్తమ బ్యాటర్ పట్ల ఇది అమర్యాదకర ప్రవర్తన అని తప్పుబట్టింది.