కేంద్రమంత్రిని పోలీసులే రాళ్లతో కొట్టించారా?

Update: 2016-10-20 06:30 GMT
కొన్ని రాష్ట్రాల్లో చోటు చేసుకునే పరిణామాలు చూస్తే నోట మాట రాదంతే. ఒక కేంద్రమంత్రి రాష్ట్రానికి వస్తున్నారంటే ఎంతలా ఏర్పాట్లు చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. కేంద్రంలో కొలువు తీరిన సర్కారుకు.. ఆ రాష్ట్రంలో ఉన్న సర్కారుకు సంబంధాలు లేకపోతే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే ఫర్లేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. తెలంగాణ సర్కారు కొలువు తీరిన కొత్తల్లో కేంద్రమంత్రులు హైదరాబాద్ కు వస్తే.. తెలంగాణ సర్కారు ఎలా వ్యవహరించేదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో పలువురు కేంద్రమంత్రులు తెలంగాణ సర్కారు తీరుకు అవాక్కు అయ్యే పరిస్థితి. ఎక్కడి దాకానో ఎందుకు.. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న వైనంపై వివరాలు సేకరించేందుకు.. సమాచారం కోసం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేస్తే.. తనతో మాట్లాడటానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించలేదన్న విషయాన్ని పార్లమెంటులోనే చెప్పటం మర్చిపోకూడదు.

కేంద్రమంత్రుల్ని రాష్ట్రాలు.. రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎంతగా తిప్పలు పెడతారన్న దానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పాలి. తాజాగా ఇంతకంటే దారుణమైన విషయం పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకుంది. అక్కడ దీదీ నేతృత్వంలో నడిచే తృణమూల్ కాంగ్రెస్ సర్కారుకు.. బీజేపీకి మధ్య టర్మ్స్ ఏమాత్రం సరిగా లేవన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్రానికి కేంద్రమంత్రి బాబుల్ సుప్రీయో వెళ్లారు. ఆయనంటేనే ఇష్టపడని తృణమూల్ నేతలు తమ ప్రతాపాన్ని కేంద్రమంత్రి వద్ద ప్రదర్శించటం ఇప్పుడు వివాదంగా మారింది. కొందరు బీజేపీ కార్యకర్తల అరెస్ట్ కు నిరసనగా కేంద్రమంత్రి బాబుల్ సుప్రీయో నిరసన తెలిపేందుకు బయలుదేరారు.

ఆయన కారును ఆందోళకారులు నల్లజెండాలతో కేంద్రమంత్రి కారును అడ్డుకున్నారు. కారు దిగి కిందకు వచ్చిన ఆయనపై టీఎంసీ (తృణమూల్) కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఒక రాయి అయితే నేరుగా కేంద్రమంత్రి ఛాతీనితాకటంతో ఆయన బాధతో విలవిలలాడారు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన.. తనపై రాళ్లదాడి చేస్తున్న టీఎంసీ కార్యకర్తల వైపు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు కేంద్రమంత్రిని అడ్డుకొని.. ఆయన్ను పక్కకు పంపే ప్రయత్నం చేశారు. ఒక కేంద్రమంత్రిగా తన కారును అడ్డుకునేలా ఆందోళనకారుల్ని పోలీసులు ఎలా అనుమతించారన్నది బాబుల్ సుప్రీయో ప్రశ్న. దీనికి పశ్చిమబెంగాల్ పోలీసుల నుంచి సమాధానం రాని పరిస్థితి. తాజా ఘటనను చూసిన వారు.. కేంద్రమంత్రిని అధికారపక్షం కార్యకర్తల చేత పోలీసులే రాళ్లతో కొట్టించారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. జరిగిన ఘటన ఈ ఆరోపణలకు దగ్గరగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News