ర‌మ్మీ స్కిల్ గేమ్‌..కోర్టులో పిటిష‌న్లు!

Update: 2017-06-28 16:45 GMT
తెలంగాణలో ఆన్‌ లైన్ ర‌మ్మీ ఆడ‌డంపై ప్ర‌భుత్వం నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ నిషేధాన్ని స‌వాల్ చేస్తూ ముంబైకి చెందిన అనేక ర‌మ్మీ నిర్వ‌హ‌ణ సంస్థ‌లు హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశాయి. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథన్, న్యాయమూర్తి తెల్లప్రోలు రజనీలతో కూడిన డివిజన్ బెంచ్ ఆ పిటిష‌న్ల‌పై మంగళవారం విచార‌ణ చేప‌ట్టింది.

పిటిష‌న‌ర్ల త‌ర‌పున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎకె గంగూలీ వాదించారు. రమ్మీ ఆట జూదం కాదని, నైపుణ్యాన్ని వెలికి తీసే క్రీడ అని ఆయన వాదించారు.రమ్మీ జూదం కాదని గతంలో సుప్రీంకోర్టు ఇతర కేసుల్లో చెప్పిన తీర్పుల‌ను ఆయ‌న ఉద‌హ‌రించారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈ వాదనలు అసంపూర్తిగా ముగిశాయి.

ఈ నిషేధం వెనుక చాలా నేప‌థ్యం ఉంది. పేకాటలో భారీగా నష్టపోయిన ఓ వ్యక్తి హైదరాబాదులోని ఓ ప్రముఖ క్లబ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కేసీఆర్‌ ప్రభుత్వం పేకాట క్లబ్బులపై ఉక్కుపాదం మోపింది. ఆ ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న త‌ర్వాత పోలీసులు  తెలంగాణ వ్యాప్తంగా దాడులు చేసి పలువురిని అరెస్టు చేశారు.

ఈ నిషేధాన్ని ఎత్తివేయ‌డానికి క్లబ్‌ ల నిర్వాహకుల పక్షాన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు విశ్వ ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు స‌మాచారం. రాయ‌బారం కోసం సీఎం వద్దకు కూడా వెళ్లినట్లు సమాచారం. అయితే, ఆ నాయకుడికి కేసీఆర్‌ అక్షింతలు వేసినట్లు వినికిడి.  పేకాట వల్ల కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయని ఆయన సద‌రు నాయ‌కుడిని మందలించిన‌ట్లు తెలిసింది. తాజాగా, ఆన్‌ లైన్ రమ్మీపై కూడా తెలంగాణ‌ ప్రభుత్వం నిషేధం విధించడంతో పేకాట నిర్వహణ సంస్థలు కోర్టుకెక్కాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News