కేసీఆర్ ప్రెస్ మీట్ కు బండి వారి భారీ కౌంటర్

Update: 2021-11-08 17:30 GMT
గడిచిన కొద్ది నెలలుగా బండి అండ్ కో చేసిన తీవ్ర ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించటం.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్టు కావటం తెలిసిందే. ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని.. ఆయనపై అవినీతి ఆరోపణలు చేయటం తెలిసిందే. బండి సంజయ్ ఎన్ని వ్యాఖ్యలు చేసినా స్పందించని కేసీఆర్.. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాత్రం అందుకు భిన్నంగా బండి సంజయ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే.

బండి సంజయ్ స్థాయి చిన్నదని.. చాలా రోజులుగా అతి మాట్లాడుతున్నారని.. తనను వ్యక్తిగతంగా నిందిస్తున్నట్లుగా మండిపడిన కేసీఆర్ ఆయనకు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. 'కేసీఆర్ ను జైలుకు పంపిస్తానని వ్యాఖ్యలు చేస్తున్నారు. నన్ను జైలుకు పంపి నువ్వు బతికి బట్టకడతావా? కేసీఆర్ ను టచ్ చేసి చూడు తెలుస్తుంది. అంత అహంకారమా? సంజయ్ కళ్లు నెత్తికెక్కి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారా? ఇకపై మీ ఆటలు సాగవు'' అంటూ ఘాటుగా రియాక్టు కావటం తెలిసిందే.

తనను ఉద్దేశించి కేసీఆర్ రియాక్టు అయిన వేళ.. రెట్టించిన ఉత్సాహంతో బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కేసీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెబుతారని మండి పడిన ఆయన.. ఆయన చెప్పిన మాటల్లో నిజాలే లేవన్నారు. అసలు గంటకో మాట మాట్లాడేది ఎవరని ప్రశ్నించిన బండి సంజయ్.. గంటకో మాట మాట్లాడి రైతుల్ని ఆగం చేసేది కేసీఆరేనని ఫైర్ అయ్యారు. 'గంటకో మాట మాట్లాడి రైతుల్ని ఆగం చేస్తున్నారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే ఆడతారు' అని తప్పు పట్టారు. బండి సంజయ్ వ్యాఖ్యల్లో కీలక వ్యాఖ్యల్ని చూస్తే..

-  వరి కొంటామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. ధాన్యాన్ని కేంద్రం కొంటుందా.. రాష్టం కొంటుందా.  ఇన్నాళ్లు కేంద్రమే వడ్లు కొన్నది. 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం లేఖ ఇచ్చింది. కేంద్రం పంపిన లేఖ కేసీఆర్‌కు వచ్చిందా.. రాలేదా?

-  రైతుల చట్టాల విషయంలో కేసీఆర్‌ పూటకో మాట మాట్లాడతారు. మార్కెట్‌ కమిటీలను రద్దు చేస్తామని కేంద్రం ఎప్పుడు చెప్పింది. దమ్ముంటే కేసీఆర్‌ ఆధారాలు చూపించాలి.

-62 లక్షల ఎకరాల్లో వరి ఎక్కడ సాగవుతుందో కేసీఆర్‌ చెప్పాలి. ఒకసారి వరి వద్దంటారు.. మరొకసారి పత్తి వద్దంటారు. రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌ మూడేళ్ల క్రితం చెప్పారు. రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో కేసీఆరే చెప్పాలి.

-  కేసీఆర్ నిన్న గంట పాటు అబద్ధాలు చెప్పారు. 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని చెప్పారు. ఆ మేరకు సాగు చేశారో లేదో తేలుద్దాం. నిపుణులతో కలిసి హెలికాఫ్టర్ లో పరిశీలిద్దామా? ప్రతి గింజా నేనే కొంటా.. కేంద్రంతో పనేమిటని కేసీఆర్ గతంలో ఉన్నారు.

-  వరి కొనుగోలుకు కేంద్రంతో పనేమిటని కేసీఆర్ గతంలో అన్నారు. ఏడేళ్ల నుంచి కేంద్రమే  కొంటుందని కేసీఆర్ చెప్పదలుచుకున్నారా? ఇన్నాళ్లు అబద్ధాలు చెప్పానని ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలి. వానా కాలం పంట కొంటామని కేంద్రం చెప్పలేదని కేసీఆర్ చెబుతున్నారు. ఆగస్టు 31న రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. అక్టోబరు నుంచి జనవరి 20 వరకు వరి కొంటామని కేంద్రం చెప్పింది. ఎఫ్ సీఐ లేఖ అందలేదని చెబితే నేను పంపుతా.  

-  ద్యోగాలు ఇవ్వనందునే నిరుద్యోగులు కూలీలుగా మారుతున్నారు. రైతు ఆత్మహత్యలు కేసీఆర్‌కు కనిపించడం లేదా..ప్రతీ గింజా మేమే కొంటామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కేంద్రం పెత్తనం ఏందని అప్పట్లో కేసీఆర్‌ విమర్శించారు మర్చిపోయారా?

-  కేంద్రమంత్రిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి నోరు పారేసుకున్నారు. పెట్రోల్.. డీజిల్ తగ్గింపు ప్రకటన చేస్తారనే ఆశించాం. కానీ అలా జరగలేదు. 2015లో తెలంగాణ వ్యాట్ పెంచింది. జీవోలు ఉన్నాయి. లీటరు పెట్రోల్ మీద రాష్ట్రానికి రూ.28 వస్తోంది.

 -  పెట్రోల్.. డీజిల్ మీద వ్యాట్ ను 24 రాష్ట్రాలు తగ్గించినప్పుడు తెలంగాణ ఎందుకు తగ్గించదు? కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్ల ఆదాయం వస్తే..అందులో రూ.2.3లక్షల కోట్లను తిరిగి రాష్ట్రాలకే ఇస్తోంది. వ్యాట్ ఆదాయం అధికంగా వచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉంది.
Tags:    

Similar News