కేటీఆర్ కు కొత్త ట్యాగ్ కట్టిన బండి

Update: 2021-12-26 03:50 GMT
ఘాటు వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లు నిలుస్తారు తెలంగాణ బీజేపీ రథసారధి బండి సంజయ్. తాజాగా ఆయన మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీదా.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ మీద తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తరచూ పూజలు.. యాగాలు చేసే సీఎం కేసీఆర్ గురించి ఆయన ఘాటుగా స్పందించారు. అంతేకాదు.. రాష్ట్ర మంత్రులంతా నాస్తికులే అంటూ సంచలన వ్యాఖ్య చేశారు.

ఇక.. సీఎం కేసీఆర్ యాగాలుచేసేది మొత్తం స్వార్థం కోసమేనని చెప్పిన బండి.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నాస్తికుడని పేర్కొన్నారు. ఇందుకు నిదర్శనంగా ఆయనో విషయాన్ని వెల్లడించారు. దుర్గాదేవి.. సీతాదేవి.. శ్రీరామచంద్రుల్ని అవమానించిన కమెడియన్ మునావర్ ఫారూఖీ వంటి వారిని కేటీఆర్ స్వయంగా రాష్ట్రానికి ఆహ్వానించటమే దీనికి నిదర్శనమి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత తన నాస్తికుడైన కొడుకు కేటీఆర్ ను కట్టడి చేయాలన్నారు. ఇప్పటివరకు మంత్రి కేటీఆర్ దేవుడ్ని నమ్ముతారో లేదో? అన్న సందేహం ఎవరికి రాలేదు.

భారీ ఎత్తున యాగాలు చేసే కేటీఆర్ కు తగ్గట్లే.. ఆయన కుమారుడు కేటీఆర్ సైతం దేవుడ్ని నమ్ముతారనే ప్రజలందరి భావన. అందుకు భిన్నంగా మంత్రి కేటీఆర్ నాస్తికుడంటూ బండి సంజయ్ తగిలించిన కొత్త ట్యాగ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. మాజీ ప్రధాని దివంగత వాజ్ పేయ్ జయంతిని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు.

మూర్ఖుడైన మునావర్ కార్యక్రమాల్ని దేశంలోని పలు రాష్ట్రాలు నిషేధిస్తే.. మంత్రి కేటీఆర్ మాత్రం రాష్ట్రంలో సభలు పెట్టేందుకు ఆహ్వానించటం సిగ్గుచేటు అన్న ఆయన.. మూనావర్ లాంటి వ్యక్తిన ిఅడ్డుకుని తీరాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బండి సంజయ్ మాటలకు మరింత ఘాటును తెస్తూ.. రాజాసింగ్ మరింతగా చెలరేగిపోయారు. మునావర్ ను తెలంగాణకు తీసుకు వస్తే కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. ఫైర్ బ్రాండ్ ఎంపీ అర్వింద్ సైతం మునావర్ ను తెలంగాణకు ఎలా తీసుకు వస్తారో తాము చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. టీ బీజేపీ నేతల మాటల్ని చూస్తే.. సీఎం కేసీఆర్ యాగాలకు కొత్త అర్థాన్ని చెప్పటమే కాదు.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ నాస్తికుడంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ రగడకు కారణంగా మారాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News