బండి సంజ‌య్ పై న‌మ్మ‌కం లేదా.. అందుకే వెయిటింగ్‌..!

Update: 2022-05-22 04:33 GMT
ఇత‌ర పార్టీ నేత‌ల‌కు బండి సంజ‌య్ పై న‌మ్మ‌కం లేదా..? అందుకే పార్టీలో చేరేందుకు సందేహిస్తున్నారా..? పార్టీలో ఉన్న కీల‌క నాయ‌కులు కూడా బ‌య‌ట‌కు వెళ‌తారా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. బండి సంజ‌య్ తెలంగాణ అధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి నుంచీ పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక మొద‌లు జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక వ‌ర‌కు విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు.

పార్టీ అధికార‌మే ల‌క్ష్యంగా ఈ ఉత్సాహాన్ని ఇలాగే కొన‌సాగిస్తూ తొలి, మ‌లి విడ‌త పాద‌యాత్రల ద్వారా బ‌లోపేతం కోసం కృషి చేస్తున్నారు. అగ్ర‌నేత‌ల వ‌రుస ప‌ర్య‌ట‌న‌ల‌తో పార్టీ శ్రేణుల్లో జోష్ తీసుకొస్తున్నారు. ప‌లువురు బీజేపీ అగ్ర‌నేత‌లు, కేంద్ర మంత్రులు తెలంగాణ‌లో ప‌ర్య‌టించి బండికి మ‌ద్ద‌తు తెలిపారు. ఇటీవ‌ల బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా కూడా వ‌చ్చి పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని బండి సంజ‌య్ భుజం త‌ట్టి వెళ్లారు.

అయితే.. ఇంత మంది అగ్ర నేత‌లు వ‌చ్చి వెళుతున్నా పార్టీలో చేరిక‌లు లేక‌పోవ‌డ‌మే పెద్ద మైన‌స్ గా మారింది. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ లో ఉన్న ప‌లువురు అసంతృప్త నేత‌లు చేర‌తారంటూ రేపు మాపు అని లీకులు ఇస్తున్నారే కానీ ఆచ‌ర‌ణ‌లో జ‌ర‌గ‌డం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ‌గోపాల రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, మేడ్చ‌ల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న‌గారి ల‌క్ష్మారెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి, ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూప‌ల్లి కృష్ణారావు.. ఇంకా ఇత‌ర పార్టీల్లో ఉన్న అసంతృప్తుల జాబితా చాంతాడంత ఉంది.

వీరందరి చేరిక ఈరోజు, రేపు అంటూ నాన్చుతున్నారే కానీ అమ‌ల్లో పెట్ట‌డం లేదు. అయితే దీనికి కార‌ణం బండి సంజ‌య్ పై ఉన్న అప‌న‌మ్మ‌క‌మే అని తెలుస్తోంది. ఆయ‌న‌కు అర్బ‌న్ ప్రాంతాల్లో త‌ప్ప ఇంకా తెలంగాణ మొత్తం ప‌ట్టు రాలేద‌ని.. ఆయ‌న‌ను న‌మ్ముకొని గోదారి ఈద‌లేమ‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. పైగా బీజేపీలో భేష‌ర‌తుగా చేరాల‌ని చెబుతున్నార‌ని.. టికెట్ల‌పై హామీ ఇవ్వ‌డం లేద‌ని అంటున్నారు. అందుకే ప‌లు పార్టీల్లో ఉన్న కీల‌క నేత‌లు కూడా బీజేపీలో చేరేందుకు వెనుకాడుతున్నార‌ట‌. హామీలు లేకుండా చేరి రాజ‌కీయ భ‌విష్య‌త్తును ప‌ణంగా పెట్ట‌లేమ‌ని స్ప‌ష్టం చేస్తున్నార‌ట‌.

అదీకాకుండా ఇటీవ‌ల కాలంలో బీజేపీలో చేరిన ముఖ్య నేత‌లు కూడా గ్రూపు త‌గాదాల వ‌ల్ల బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌ని చెబుతున్నారు. మోత్కుప‌ల్లి న‌ర్సింలు, ఇనుగాల పెద్దిరెడ్డి, నాగం జ‌నార్ద‌న్ రెడ్డి, తీన్మార్ మ‌ల్ల‌న్న త‌దిత‌ర నాయ‌కులు అందులో ఇమ‌డ‌లేక‌పోయారు. క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్, మ‌రికొన్ని జిల్లాల్లో ఉన్న సీనియ‌ర్‌ నేత‌లు కూడా వేరే దారి వెతుక్కుంటున్నార‌ట‌. అందుకే బీజేపీలో చేరేందుకు ఆస‌క్తిగా ఉన్న నాయ‌కులు వేచి చూసే ధోర‌ణిలో ఉన్నార‌ట‌. ఈ విష‌యంలో బీజేపీ అధిష్ఠానం కూడా అసంతృప్తితో ఉంద‌ట‌. చేరిక‌ల అంశాన్ని త్వ‌ర‌గా చ‌క్క‌దిద్దాల‌ని సూచించింద‌ట‌. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!
Tags:    

Similar News