ఎక్కడి కి రావోలో.. డేట్.. టైం చెబితే వస్తా.. 6 ముక్కలు కాదు 10 ముక్కలకు రెఢీ

Update: 2021-11-10 09:46 GMT
ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించే లక్షణం పోయి చాలాకాలమే అయ్యింది. చెంప మీద కొట్టకున్నా.. ముందే కొట్టేయటం ద్వారా అధిక్యతను ప్రదర్శించుకోవాలన్న తపన రాజకీయాల్లో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ దూకుడు కొత్త సమస్యలకు తెర తీయటమే కాదు.. రాజకీయ ఉద్రిక్తతలకు కారణమవుతుంది. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు సైతం.. తమ రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి ప్రెస్ మీట్ లోనే ఎలాంటి మొహమాటం లేకుండా ‘నా కొడకా’ అనేస్తున్న వైనం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని మరో స్థాయికి తీసుకెళుతోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎదురైన ఓటమి భారాన్ని ఎవరూ ఊహించలేనంత సీరియస్ గా సీఎం కేసీఆర్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎదురుదెబ్బలు ఆయనకు కొత్తేం కాకున్నా.. తిరుగులేని రాజకీయ అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత.. తగిలిన పెద్ద దెబ్బగా చెప్పాలి. ఆ మాటకు వస్తే.. హుజూరాబాద్ ఓటమితో పోలిస్తే దుబ్బాక ఓటమే తీవ్రమైనది. ఈటల బలాన్ని కేసీఆర్ తక్కువగా అంచనా వేయటం కన్నా.. తన బలాన్ని.. తన తెలివిని ఎక్కువగా ఊహించుకోవటమే అసలు సమస్యగా చెప్పాలి.

ఓటమిని జీర్ణించుకోలేని కేసీఆర్.. తన ఫస్ట్రేషన్ మొత్తాన్ని ప్రెస్ మీట్లు పెట్టేసి తీర్చుకుంటున్నట్లుగా రాజకీయ ప్రత్యర్థులు మండిపడుతున్నారు. తన ఫాం హౌస్ గురించి అదే పనిగా మాట్లాడే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద ఘాటుగా రియాక్టు అయిన కేసీఆర్.. ఒక దశలో ‘ఫాంహౌస్ వచ్చే ధైర్యం చేస్తావా? ఆరు ముక్కలవుతావు నా కొడకా’ అంటూ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి.

ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి ఈ స్థాయి మాటలు రావటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. తనను జైల్లో వేస్తామని బండి సంజయ్ తరచూ అంటున్నారని.. అంత దమ్ముందా? కేసీఆర్ ను టచ్ చేసే ధైర్యం ఉందా? అంటూ గులాబీ బాస్ విరుచుకుపడటం తెలిసిందే. అధికారం చేతిలో ఉండి.. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న అధినేతే ఇలా మాట్లాడితే.. రాజకీయంగా అధిక్యతను ప్రదర్శించాలని భావించే బండి సంజయ్ ఊరుకుంటారా? కేసీఆర్ మాటలకు ఏ మాత్రం తగ్గని రీతిలో రియాక్టు అయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులకు రూన10 లక్షల దళితబంధు ఇవ్వకుంటే సీఎం కేసీఆర్ కు విమానం మోతనే అంటూ వ్యాఖ్యానించిన బండి సంజయ్.. సరైన టైంలో టచ్ చేస్తానంటూ తాజాగా వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్. నయా నిజాం కేసీఆర్ పాలనను సమాధి చేసి రాష్ట్రంలో రామరాజ్యం స్థాపిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు.

దళితులు.. పేదల కోసం తల నరుక్కోవటానికి తాను సిద్ధమన్న ఆయన.. కేసీఆర్ సిద్ధమా? అని ప్రశ్నించారు. ‘నా కొడక తల నరుకుతా..’ అన్నావు కదా.. డేట్.. టైం చెప్పు.. ప్రగతిభవన్ కు రావాలా? ఫామ్ హౌస్ కు రావాలో చెబితే అక్కడికే వస్తా. ఆరు ముక్కలు కాదు.. నా తల పది ముక్కలు నరుక్కోవటానికి సిద్ధంగా ఉన్నానంటూ ఘాటు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. నా కొడక.. ఆరు ముక్కలు చేస్తానంటూ వీరంగం వేసిన సీఎం కేసీఆర్.. బండి సంజయ్ తాజా సవాలుకు ఏమని బదులిస్తారో చూడాలి.
Tags:    

Similar News