బీజేపీ సీఎం లొల్లి: కిషన్ రెడ్డినా? బండి సంజయ్ నా?

Update: 2020-12-23 04:38 GMT
అధికారం మా చెడ్డది. ఆ కుర్చీ కోసం రాజకీయాల్లో ఎన్ని దారుణాలు జరిగాయో మనం చరిత్రలో చూశాం. తెలుగు దేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ను కూలదోసి మరీ నాడు చంద్రబాబు గద్దెనెక్కారు. ఇలా అధికార యావ నేతల్లో ఎక్కువే. అయితే బీజేపీ మాత్రం డిఫరెంట్. బీజేపీలో నేతలు ఎక్కువగా కలిసి కట్టుగా పార్టీ కోసం పనిచేస్తారు. పార్టీ హైకమాండ్ ఎవరిని సీఎం చేసినా మద్దతిస్తారు. అసమ్మతి అనేది ఉండదు. ఎక్కువగా ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం గల నేతలు పార్టీనే దేవుడిగా భావిస్తారు. బహిరంగ ప్రకటనలు చేయడం అరుదు.

కానీ తాజాగా తెలంగాణలో ట్రెయిన్ రివర్స్ అవుతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఆదిలాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని.. కాబోయే సీఎం కిషన్ రెడ్డిదేనని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ప్రకటించేశారు. బాపూరావు ప్రకటన బీజేపీలో కలకలం రేపింది.

నిజానికి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చేశాడు. ఆయన హయాంలో బీజేపీ పెద్దగా పురోగమించింది లేదు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కిషన్ రెడ్డి హవా నడవలేదు. అంతా బండి సంజయ్ ఆధిపత్యమే కొనసాగింది. పార్టీని దూకుడుగా నడపడంలో బండి సక్సెస్ అయ్యారు. ఆయన కోసం ఓ కార్యకర్త సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ అడ్డా అయినా కిషన్ రెడ్డి పెద్దగా ప్రభావం చూపలేదు.

అయితే బండి సంజయ్ ముద్ర తెలంగాణ బీజేపీకి ఊపిరిలూదింది. కానీ సీనియర్ కావడం.. కేంద్రమంత్రిగా ఉండడంతో పరిపాలన, అనుభవంలో కిషన్ రెడ్డి ముందు. ఒకవేళ నిజంగానే 2023లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే కేంద్రంలోని బీజేపీ నడిపించిన బండి సంజయ్ ని సీఎంను చేస్తుందా.? లేక సీనియర్ కిషన్ రెడ్డిని చేస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది.

ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి పేరును ఆయన మద్దతు దారులు వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. అయితే మెజార్టీ నేతలు బండి వైపే ఉన్నారు. ఆయన వల్లే పార్టీ ఈ స్థితికి చేరిందని అంటున్నారు. కానీ హైకమాండ్ నిర్ణయమే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు శిరోధార్యం కానుంది.
Tags:    

Similar News