టీడీపీ టికెటిచ్చినా పారిపోయిన ఎమ్మెల్యే

Update: 2019-03-19 06:49 GMT
టీడీపీ టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేయమని అస్త్రశస్త్రాలు పంపించింది. కానీ యుద్ధంలోకి దిగాకే అసలు కథ మొదలైంది. టీడీపీ తరుఫున నిలబడితే గెలువలేనని గ్రహించిన అభ్యర్థి పారిపోయాడు. తాను పోటీచేయలేనని అస్త్రసన్యాసం చేశాడు. ఇప్పుడు టీడీపీకి అక్కడే అభ్యర్థి కరువయ్యాడట.. ఈ విచిత్రం కర్నూలు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.

కర్నూలు జిల్లా బనగాన పల్లి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి తాను టీడీపీ నుంచి పోటీచేయనని టికెట్ ఇచ్చిన తరువాత బరిలోంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 2014 ఎన్నికల్లో ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి బనగానపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి టీడీపీ అదే సీటును ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేటాయించింది. కానీ అయిదేళ్లలో టీడీపీపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. తాను పోటీచేసినప్పటికీ గెలువలేనని.. ఓటమి ఖాయమనే ఆందోళనతోనే బీసీ జనార్ధన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు.

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో బనగానపల్లి నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీచేసిన కాటసాని రామిరెడ్డి విజయం సాధించారు. అనంతరం 2014 ఎన్నికల్లో కాటసాని వైసీపీలో చేరి పోటీ చేశాడు. అదే 2014లో టీడీపీ తరుఫున నిలబడ్డ బీసీ జనార్ధన్ రెడ్డి జిల్లాలో వైసీపీ గాలి  వీచిన తట్టుకొని నిలబడి కాటసానిని ఓడించాడు.

ఇప్పుడు కూడా వైసీపీ తరుఫున కాటసాని నిలబడగా.. టీడీపీ నుంచి బీసీ జనార్ధన్ రెడ్డి పోటీచేస్తున్నారు. సీఎం చంద్రబాబు తొలి జాబితాలోనే ఈయనకు టికెట్ ఇచ్చాడు. దీంతో ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టారు. కానీ నియోజకవర్గంలో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఈసారి ఓటమి ఖాయమనే అంచనాతో పోటీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

ఇప్పుడు బీసీ జనార్ధన్ రెడ్డి ఆకస్మికంగా తప్పుకోవడంతో టీడీపీకి అభ్యర్థి లేని పరిస్థితి. నామినేషన్లకు ఇంకా ఐదు రోజులే గడువు ఉంది. నియోజకవర్గంలో టీడీపీలో బీసీ తర్వాత చల్లా రామకృష్ణా రెడ్డి కీలక నేత. మొన్నటిదాకా పార్టీలో టికెట్ కోసం పోరాడారు. టికెట్ దక్కకపోవడంతో ఆయన వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ అభ్యర్థి లేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కొత్త ముఖం కోసం టీడీపీ వెతుకులాట ప్రారంభించిందట..
Tags:    

Similar News