బెల్జియం కొత్త రూల్.. ఆఫీసు టైం తర్వాత బాస్ ను పట్టించుకోనక్కర్లేదు

Update: 2022-01-24 08:30 GMT
వంద.. నూటయాభై ఏళ్ల క్రితం బానిసలు ఉండేవారు. వారిని కొనుక్కున్నోళ్లు.. వారి చేత బండచాకిరి చేయించుకునే వారన్న విషయాల్నిపుస్తకాల్లోచదివినప్పుడు.. సినిమాల్లో చూసినప్పుడు.. అమ్మో.. అంత ఆరాచకంగా వ్యవహరించేవారా? అంటూ బుగ్గలు నొక్కుకునే వారికి కొదవ ఉండదు.

కానీ.. ఇప్పటి డిజిటల్ ప్రపంచంలోనూ.. నాటి బానిస బతుకులకుఏ మాత్రం తీసిపోని రీతిలో పారిశ్రామికవేత్తలు.. కంపెనీలు తమ ఉద్యోగుల్ని నయా బానిసలుగా చేసుకుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఉద్యోగం.. జీతం ఇస్తున్నామన్న పేరుతో వారిపై పెత్తనం చెలాయించటం.. టార్గెట్ల కత్తి మెడకు పెట్టి.. ఇష్టారాజ్యంగా వాడేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మొదట్లో ఐటీ పరిశ్రమలో ఇలాంటివి తక్కువగానే ఉన్నా.. తర్వాతి కాలంలో వచ్చి పడిన మాంద్యం దెబ్బకు ఉద్యోగ భద్రత గాల్లో దీపంగా మారిపోవటం.. బండ చాకిరి చేయటం మినహా మరేం చేయలేని పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగులు వచ్చేశారు.

అప్పటివరకు ఐటీ ఉద్యోగి అంటే.. కొత్త అల్లుడి మాదిరి కంపెనీలు ట్రీట్ చేస్తాయన్న భావన కాలక్రమంలో చెరిగిపోయింది.

ఇప్పుడు ఐటీ.. నాన్ ఐటీ.. ఎవరైనా సరే.. ఉద్యోగుల్ని జీతాలకు తలాడించే బానిసలు మాదిరిగానే చూస్తున్నాయి చాలా సంస్థలు. కరోనా మహమ్మారిని అడ్డు పెట్టుకొని.. ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు ఇచ్చేసి.. మీకేంపని ఉంటుంది? ఇంట్లోనే ఉండి పని చేయటమే కదా? అంటూ యావరేజ్ గా చేసే పనికి రెట్టింపు పని చేయించుకుంటున్న కంపెనీలు అన్ని ఇన్ని కావు.

ఈ తీరుతో విసిగిపోయిన లక్షలాది మంది ఉద్యోగులు గత ఏడాది తాము పని చేసే కంపెనీలకు గుడ్ బై చెప్పేసి.. కొత్త ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రపంచంలోని ఉద్యోగులకు సరికొత్త అసరా ఇచ్చేలా బెల్జియం ప్రభుత్వం ఉద్యోగులకు సరికొత్త హక్కును కల్పిస్తూ కొత్త చట్టాన్ని చేసింది. ఈ కొత్త రూల్ ప్రకారం.. ఆఫీసులో తమ షిప్టు పూర్తి అయిన తర్వాత.. ఉద్యోగులు తమ బాస్ లు.. ఇతర పై అధికారుల మెసేజ్ లకు.. ఫోన్లకు స్పందించాల్సిన అవసరం లేదని తేల్చేసింది.

ఉద్యోగులు స్పందించని పరిస్థితుల్లో యాజమాన్యాలు వారికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్నిక్రియేట్ చేయకూడదని స్పష్టం చేసింది.

అత్యవసర సందర్భాల్లో ఉద్యోగుల్ని సంప్రదించే వెసులుబాటు ఇచ్చేలా కొత్త నియమావళిని సిద్ధం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి అమలయ్యే ఈ కొత్త రూల్ ను ప్రస్తుతానికి ఆ దేశ ప్రభుత్వ ఉద్యోగులకు పరిమితం చేసింది. మరి.. ప్రైవేటుఉద్యోగులకు ఈ కొత్త విధానాన్ని వర్తించేలా నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి. ఏమైనా.. బెల్జియం ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. మిగిలిన దేశాల వారు ఉద్యోగుల హక్కులకు సరికొత్త నిబంధనల్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News