వరద నీటిలో బెంగుళూరు ఎయిర్‌పోర్టు.. ట్రాక్టర్లలో ప్యాసింజర్ల ప్రయాణం !

Update: 2021-10-12 06:44 GMT
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కర్ణాటకపై విరుచుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు స్థాయి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీని తీవ్రత మరింత ఉధృతమైంది. బెంగళూరు సహా పొరుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ప్రత్యేకించి, ఉద్యాననగరిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం ఆరంభమైన వర్షం కొన్ని గంటల పాటు కుండపోతగా దంచి కొట్టింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సోమ‌వారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షాన్ని జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బెంగ‌ళూరు పట్టణమంతా జ‌ల‌మ‌యం కావడంతో ప్రయాణికులు, పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోత‌ట్టు ప్రాంతాల్లోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. ఎక్కడచూసినా నీరే కనిపిస్తుండంటతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు

బెంగళూరులో కొన్ని గంటల వ్యవధిలో 139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బెంగళూరు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇవ్వాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది. మరోసారి రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కావడానికి అవకాశం ఉన్నట్లు పేర్కొంది. బెంగళూరు, బెంగళూరు రూరల్, రామనగర, చిక్‌ బళ్లాపుర, కోలార్, తుమకూరు జిల్లాల్లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా.. బెంగ‌ళూరులోని కెంపేగౌడ అంత‌ర్జాతీయ విమానాశ్రయం, దాని ప‌రిస‌రాల్లోకి భారీగా వరద నీరు చేరింది. వరద ధాటికి విమానాశ్రయానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతోపాటు నీరు భారీగా నిలిచిపోవ‌డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత‌మంది ప్రయాణికులు అయితే ట్రాక్టర్లల్లో సైతం ప్రయాణం చేశారు. ఎయిర్‌ పోర్టుకు చేరుకునేందుకు వారు ట్రాక్టర్లల్లో ప్రయాణం చేశారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ గా మారాయి.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా, సరైన ప్రణాళిక లేకపోవడంతో నీరు నిలిచిపోయినట్లు ప్రయాణికులు అసహనం వ్యక్తంచేశారు. ఇదిలాఉంటే,. మంగళవారం కూడా బెంగ‌ళూరు పట్టణంలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. బెంగళూరు దక్షిణ ప్రాంతం శివార్లలోని భాగలూరు, చిక్కజాల, యలహంక, విద్యారణ్యపుర, రాజానుకుంటె తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, పరిసర ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు ఏకధాటిగా వర్షం పడింది. ఫలితంగా విమానాశ్రయంలోకి వరదనీరు పోటెత్తింది. రెండు అడుగుల మేర వరదనీరు నిలిచింది.
విమానాశ్రయానికి వెళ్లే దారులపై కొన్ని చోట్ల మోకాలి లోతు వరకు వర్షపు నీరు నిలిచింది. ఫలితంగా- క్యాబ్స్ తిరగలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో అటు విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు.. అక్కడి నుంచి నగరానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విమానాశ్రయానికి వెళ్లడానికి క్యాబ్స్ అందుబాటులో లేకపోవడంతో ట్రాక్టర్లపై కూర్చుని ప్రయాణం సాగించారంటే వర్షం ఏ స్థాయిలో దంచి కొట్టిందో అర్థం చేసుకోవచ్చు

అనేక అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యశ్వంతపుర, మత్తికెరె, మేఖ్రీ సర్కిల్, కృష్ణరాజ మార్కెట్, కేఆర్ సర్కిల్, మల్లేశ్వరం, మెజస్టిక్ వంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఇవ్వాళ కూడా బెంగళూరు సహా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటక ఉత్తర ప్రాంతంలోని విజయపురా, కొప్పళ, బళ్లారి, బెళగావి, బాగల్‌కోట్, రాయచూర్, గదగ్, దక్షిణ ప్రాంతంలోని చిక్‌మగళూరు, శివమొగ్గ, కొడగు, కోలార్, తుమకూరు జిల్లాల్లో మరో 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు బెంగళూరులో 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సోమవారం ఒక్కరోజులోనే 139 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇదే పరిస్థితి ఇంకొద్దిరోజులు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ మధ్యకాలంలో నమోదయ్యే సాధారణ వర్షపాతం 69 మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది ఆ రికార్డును బద్దలైంది. అటు కేరళకు ఆనుకుని ఉన్న మంగళూరు, చామరాజనగర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి


Tags:    

Similar News