రోడ్ల మీద ‘బీహెచ్’ సిరీస్ రిజిస్ట్రేషన్.. ఎందుకలా?

Update: 2021-08-29 08:21 GMT
రోడ్డు మీద వెళ్లే వాహనం నెంబర్ ప్లేట్ మీద కనిపించే నెంబరు తర్వాత.. పైన కనిపించే స్టేట్ పేరుతో.. అదే రాష్ట్రానికి చెందిన వెహికిల్ అన్న విషయం ఇట్టే తెలుస్తుంటుంది. 'ఏపీ' అంటే ఆంధ్రప్రదేశ్ అని.. టీఎస్ అంటే తెలంగాణ అని.. టీఎన్ అంటే తమిళనాడు అని.. కేఎల్ అంటే కేరళ అని.. ఎంపీ అంటే మధ్యప్రదేశ్ అని జేకే అంటే జమ్ముకశ్మీర్ అని ఇట్టే తెలిసిపోతుంది. ఇలా కాకుండా.. తాజాగా 'బీఎస్' (BH)సిరీస్ నెంబరు ప్లేట్ల మీద కనిపించనున్నాయి. అంటే.. దీనికి ఫలానా స్టేట్ అంటూ ప్రత్యేకంగా ఉండదు. బీహెచ్ తో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంతకీ బీహెచ్ అంటే.. భారత్ అని అర్థం. అంటే.. ఇప్పటివరకు మోడీ మాస్టారు చెప్పే ఒక దేశం.. ఒక.. అంటూ రకరకాల ప్రోగ్రాంలను తెర మీదకు తీసుకురావటం తెలిసిందే.

తాజాగా వాహన రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఒక దేశం.. ఒక రిజిస్ట్రేషన్ నెంబరు అన్నది కాన్సెప్టును తీసుకొచ్చారు. అయితే.. ఈ రిజిస్ట్రేషన్ అందరికి చేయరు. కొందరికి మాత్రమే చేస్తారు. అసలీ బీహెచ్ సిరిసీ్ ను తేవటానికి కారణం.. ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు.. ఆ రాష్ట్రంలో తమ వాహనాన్ని మరోసారి రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఈ సిరీస్ లో రిజిస్ట్రేషన్ ను ఎవరికి చేస్తారు? ఎందుకు చేస్తారన్న విషయాల్లోకి వెళితే..

-  ఉద్యోగ.. కంపెనీ పనుల్లో భాగంగా తరచూ వేర్వేరు రాష్ట్రాలకు బదిలీ అయ్యే వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు.

-  ఈ విధానంలో వాహనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే.. రక్షణ బలగాల్లో పని చేస్తూ ఉండటం.. లేదంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆఫీసులు ఉన్న కేంద్ర.. రాష్ట్ర కార్యాలయాల్లోనూ.. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ.. లేదంటే నాలుగు రాష్ట్రాల్లో శాఖలు ఉన్న ప్రైవేటు కంపెనీల్లో పని చేసే వారికి ఈ రిజిస్ట్రేషన్ ను చేస్తారు.

-  ఈ విధానంలో రిజిస్ట్రేషన్ చేయటం ద్వారా.. రాష్ట్రం మారినప్పుడల్లా రిజిస్ట్రేషన్ చేయించుకునే తలనొప్పి తగ్గుతుంది. రెండేళ్లకు ఒకసారి రోడ్ ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది.

- ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాన్ని.. వేరే రాష్ట్రానికి తరలిస్తే.. అలా తరలించిన 12 నెలల్లోపు ఆ రాష్ట్రంలో మరోసారి రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉండేది. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లోని రోడ్ ట్యాక్సును కట్టేసిన తర్వాత గతంలో తాను కట్టిన మొత్తాన్ని రిఫండ్ ఇవ్వాలంటూ మరో దరఖాస్తు పెట్టుకోవాల్సి వచ్చేది. ఇలా ఎన్నో ఇబ్బందులకు గురయ్యే దానికి చెక్ చెబుతూ తాజాగా తీసుకొచ్చిన కొత్త విధానంతో ఇలాంటి తలనొప్పులు తీరిపోనున్నాయి.
Tags:    

Similar News