మోడీని టార్గెట్ చేస్తూ తొలి ‘భారత్ బంద్’

Update: 2016-11-24 04:25 GMT
ఓపెనింగ్ అదిరిపోయినా.. దాన్ని కొనసాగించటంలో చోటు చేసుకుంటున్న తడబాటుతో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు. నల్లధనానికి చెక్ చెప్పటంతో పాటు.. దేశంలో జరిగే ప్రతి కార్యకలాపాన్ని అధికారికం చేయాలన్న సదుద్దేశ్యంతో స్టార్ట్ చేసిన పెద్ద నోట్ల రద్దు యవ్వారం.. నిద్రాణంగా ఉన్న విపక్షాలకు కొత్త ఊపిరిని ఇచ్చాయని చెప్పాలి. నోట్ల రద్దు ఉదంతం మదట మోడీ పరివారానికి తిరుగులేని అధిక్యత లభించేలా చేసినా.. దాన్ని కొనసాగింపు విషయంలోమోడీ సర్కారు తప్పుల మీద తప్పులు చేయటం ఇప్పుడు శాపంగా మారింది.

నోట్ల రద్దుపై ప్రజల ఆమోదం ఉన్నప్పటికీ.. రద్దు కారణంగా బ్యాంకుల వద్ద భారీ క్యూలు.. ఏటీఎంలో డబ్బులు లేకపోవటం మోడీ సర్కారుకు శాపంగా మారింది. దీంతో.. కోట్లాది మంది ప్రజలు నిత్యం క్యూ లైన్లలో గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కరెన్సీ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా.. బ్యాంకులకు వెళుతున్న ప్రతిఒక్కరికి కరెన్సీ లేదన్న మాటను బ్యాంకు సిబ్బంది పదే పదే చెబుతున్నారు. దీంతో.. అవసరానికి వెళుతున్న ప్రజలకు చికాకులు తెప్పిస్తోంది.

దీన్నే రాజకీయ పక్షాలు తమకు లభించిన అవకాశంగా భావిస్తూ.. పావులుకదుపుతున్నారు. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై తీవ్రస్థాయిలో మండిపడుతూ.. ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విపక్ష పార్టీలకు చెందిన అధినేతలు ఒక జట్టుగా మారి.. కలిసికట్టుగా మోడీ మీద వార్ ప్రకటించిన పరిస్థితి. ఈ మధ్యనే మొదలైన పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో విపక్షాలన్నీ కలిసికట్టుగా (టీఆర్ఎస్ లాంటి కొన్ని పార్టీలు వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తున్నాయి) మోడీ సర్కారు తీసుకున్న రద్దుపై దశల వారీగా నిరసనలు నిర్వహిస్తున్నారు.

నోట్ల రద్దు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రణాళికా రహిత ఆర్థిక ప్రయోగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అభివర్ణిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రద్దు నిర్ణయం వెనుక భారీ కుంభకోణం ఉందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి సన్నిహితులైన పారిశ్రామికవేత్తలకు రద్దు నిర్ణయం ముందుగానే తెలుసని.. దీని వెనుకభారీ కుంభకోణం ఉందని.. సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ సందర్భంగా మోడీపై రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు సంధిస్తున్నారు. పాప్ సంగీత కచేరీల్లో ప్రధాని ఉపన్యాసాలు చేస్తారు కానీ.. 200 మందికి పైగా ఉన్న పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి మాత్రం మోడీ నోరు పెగలదంటూ మండిపడుతున్నారు. రద్దు నిర్ణయం కారణంగా సాఫీగా సాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ భారీ కుదుపునకు లోనైందన్న రాహుల్ కు విపక్ష పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. మోడీ సర్కారు మీద ఒత్తిడిని పెంచేందుకు వీలుగా.. తమ ఆందోళనను ఉధృతం చేయాలన్న ఆలోచనలోఈ నెల 28న భారత్ బంద్ కు విపక్షాలు పిలుపునిచ్చాయి. మోడీ సర్కారు ఏర్పడిన రెండున్నరేళ్ల కాలంలో విపక్షాలన్నీ కలిసి భారత్ బంద్ కు పిలుపునివ్వటం ఇదే తొలిసారి. మరీ బంద్ ఎలా సాగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News