వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్?

Update: 2016-10-28 09:18 GMT
ఫోన్ ట్యాపింగ్ తో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు అదే అస్త్రాన్ని ప్రతిపక్షాలపైన - పనిలో పనిగా మిత్రపక్షంలోని తనకు వ్యతిరేకంగా ఉన్నవారు - మీడియాపైనా ప్రయోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి దీనిపై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు.  చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ నేతలతో పాటు మీడియా అధినేతలు - ప్రముఖ విలేకర్లు - బీజేపీ నేతలు - ప్రజా సంఘాల నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పారు.

తనవి ఉత్తుత్తి ఆరోపణలు కావని.. నిజాన్ని నిర్దారించుకున్న తర్వాతే తాను మీడియా సమావేశం పెట్టానని చెప్పారు. తన మాట వినని పోలీసు అధికారుల ఫోన్లు కూడా చంద్రబాబు ట్యాప్ చేశారని ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్ ద్వారా వ్యక్తిగత అంశాలను తెలుసుకుని వాటి సాయంతో బ్లాక్ మెయిల్ చేసి దారిలోకి తెచ్చుకుంటున్నారని భూమన చెప్పారు. పారిశ్రామిక వేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అన్నారు. చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్‌ లిస్ట్ లో టీడీపీలోని కొందరు అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్పారు. విలేకర్ల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బానిసలుగా మార్చుకుని అనుకూల కథనాలు రాయించుకుంటున్నారని ఆరోపించారు.

ఇందుకోసం టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక వింగ్‌ ను ఏర్పాటు చేశారని విమర్శించారు. ఇలా ఫోన్లు ట్యాపింగ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేసే లఫంగిలా చంద్రబాబు తయారయ్యాడని ఫైర్ అయ్యారు. బీజేపీలో తనకు వ్యతిరేకంగా ఉన్న నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తూ లొంగదీసుకుంటున్నారని చెప్పారు. తాము చెప్పింది నిజం కాకపోతే చంద్రబాబు నేరుగా బయటకు వచ్చి ఖండించాలని సవాల్ విసిరారు. తాము ఈ అంశంపై పార్లమెంట్‌ లో పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల వ్యక్తిగత భద్రత ప్రమాదంలో పడుతోందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News