మరో మాజీ సీఎంను జైలుకు పంపనున్నారా?

Update: 2015-12-21 04:14 GMT
ఈ మద్యకాలంలో ముఖ్యమంత్రి స్థాయి మరీ చులకనైపోయిందా? అంటే అవునన్న మాటను చెబుతున్నారు పలువురు నేతలు. ఒక రాష్ట్రానికి అధిపతి అయిన ముఖ్యమంత్రిని.. కేంద్రంలోని మోడీ సర్కారు బంతాట ఆడుకుంటున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి ఇంటి మీద వెనుకా ముందు చూసుకోకుండా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి సంచలనం సృష్టిస్తే.. ఈ మధ్యనే ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలోని ముఖ్య కార్యదర్వి కార్యాలయంపై సోదాలు నిర్వహించటం.. కొన్ని ఫైళ్లను సీబీఐ స్వాధీనం చేసుకోవటం జరిగింది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇళ్లల్లో కానీ.. ఆఫీసుల్ని కానీ తనకున్న అధికారంతో హల్ చల్ చేస్తుందన్న భావన పెరిగిపోతోంది. ముఖ్యమంత్రికే దిక్కు లేనప్పుడు.. మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాకు కాలం ఏ మాత్రం బాగోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు కేసుల రూపంలోకి మారి.. ఆయన్ను జైలుపాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ దాదాపుగా పూర్తి అయినట్లు సమాచారం.

హర్యానాలోని సంచకుళ పారిశ్రామిక పార్కులోని 14 ఫ్లాట్లను నిబంధనలను మార్చి తమకు కావాల్సిన వారికి కట్టబెట్టారన్నది ఆరోపణ. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి హుడాతో పాటు.. మరో మాజీ ఐపీఎస్ అధికారి.. నలుగురు అధికారుల్ని ఈ కుంభకోణంలో భాగస్వాములుగా చేశారు.  ఇదే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చౌతాలా ఇప్పటికే జైలుశిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా.. మరో మాజీ ముఖ్యమంత్రికి జైలు దిశగా పడుతున్న అడుగుల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. కక్ష సాధింపు చర్యలకు కేంద్రం పాల్పడుతుందంటూ కాంగ్రెస్ వ్యాఖ్యలు చేస్తోంది. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు హుడాకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయన్న మాట బలంగా వినిపిస్తోంది. ఒకవేళ హుడాను జైలుకు తరలించే ప్రయత్నం చేస్తే.. దేశ వ్యాప్తంగా ఈ అంశాన్ని ప్రచారం చేయటం.. మాజీలపై కేంద్రం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాల్ని ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Tags:    

Similar News