ఆర్టికల్ 370పై ఆ రాష్ట్ర మాజీ సీఎం మాటలతో కాంగ్రెస్ కు భారీ షాక్

Update: 2019-08-19 08:48 GMT
ఆర్టికల్ 370 నిర్వీర్యంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తిన్న ఎదురుదెబ్బలు అన్ని ఇన్ని కావు. పార్లమెంటు సాక్షిగా ఈ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా పార్టీ లైన్ కు భిన్నంగా కాంగ్రెస్ నేతలు తమ వాదనలు వినిపించిన తీరు చూస్తే.. పార్టీలో కొన్ని అంశాల మీద ఎంతటి గందరగోళం ఉందన్న విషయం అందరికి అర్థమయ్యేలా చేసింది. సైద్ధాంతిక అంశాల మీద నేతల్ని కంట్రోల్ చేయటంలో కాంగ్రెస్ విఫలం కావటం.. ప్రత్యర్థి పార్టీని తన వాదనతో చీల్చే విషయంలో సక్సెస్ అయ్యారు ప్రధాని మోడీ.

ఇదిలా ఉంటే.. ఆర్టికల్ 370 నిర్వీర్యం మీద తాజాగా హర్యానా మాజీ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ అంశంపై తల బొప్పి కట్టిన కాంగ్రెస్ అధినాయకత్వానికి మరింత తలపోటు పెంచేలా కామెంట్స్ చేయటం గమనార్హం. ఆర్టికల్ 370 నిర్వీర్యంపై తన పూర్తి మద్దతు ప్రకటించిన ఆయన.. కాంగ్రెస్ గతంలో మాదిరి లేదన్నారు.

కాంగ్రెస్ తన మార్గాన్ని మర్చిపోయిందని.. ప్రభుత్వం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే తాను మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 నిర్వీర్యంపై మా పార్టీ వారు పూర్తిగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ మునుపటి మాదిరి లేదు.. దేశ భక్తికి సంబంధించి.. ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో నేను ఎవరి మాటా వినని ఆయన తేల్చేశారు.

తాను దేశభక్తుల ఫ్యామిలీలో పుట్టానని.. జాతీయ అంశాల విషయంలో ఎవరి మాటా తాను వినని తేల్చి చెప్పిన ఆయన.. ఆర్టికల్ 370పైన బీజేపీ స్టాండ్ కు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో.. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని.. వాటిని పట్టించుకోవాలంటూ చురకలు కూడా వేశారు. మొత్తానికి ఆర్టికల్ 370 నిర్వీర్యం విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేతల మనసుల్ని మోడీ గెలుచుకోవటంలో సక్సెస్ అయ్యారని చెప్పకతప్పదు.
Tags:    

Similar News