దాయాది పాడు బుద్ధిని చెప్పిన ఆర్మీ చీఫ్

Update: 2019-09-23 17:30 GMT
ఎన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా.. ప్రపంచం మొత్తం తనను తప్పు పడుతున్నా.. ఉగ్రవాద వ్యాప్తి విషయంలో తన చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. దాయాది పాక్ మాత్రం తన తీరును మార్చుకోవటం లేదు. తాజాగా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సంచలన వాస్తవాల్ని వెల్లడించారు. పాకిస్తాన్ లోని బాలాకోట్ లో మెరుపుదాడులతో ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాన్ని ఆ దేశం మళ్లీ తెరిచిందన్నారు.

ప్రస్తుతం 500 మందికి పైగా ఉగ్రవాదులు భారత్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. తగిన సమయం కోసం వారు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 14న జమ్ము కశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడిలో 50 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న వైనం తెలిసిందే.

ఈ దుర్మార్గం తమదేనంటూ పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించుకోవటం.. ఫిబ్రవరి 26న బాలాకోట్ లోని జైషే ప్రధాన స్థావరంపై భారత వైమానిక దళాలు మెరుపుదాడులకు దిగటం.. బాంబుల వర్షం కురిపించటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

అప్పుడు నేలమట్టమైన ఉగ్రస్థావరాన్ని తిరిగి తెరిచినట్లుగా బిపిన్ పేర్కొన్నారు. తాజాగా పాక్ ఉగ్రవాదులు మళ్లీ తమ కార్యక్రమాల్ని బాలాకోట్ లో ముమ్మరం చేశారన్నారు.  తాజాగా చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ ఆకాడమీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత వైమానిక దళం తీసుకున్న చర్యల తర్వాత తాజాగా బాలాకోట్ ఉగ్రమూకలు చేరాయి. ఉగ్రవాదులకు అండదండలు ఇవ్వటాన్ని పాక్ మానుకోవాలన్నారు. తాము బాలాకోట్ ను దాటుకొని వెళ్లి దాడులు చేయగలమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్మీచీఫ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత లభించటానికి కారణం.. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించనున్న వేళ.. బిపిన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకునేలా చేశాయి. చూస్తుంటే.. రానున్న రోజుల్లో పాక్ విషయంలో మోడీ సర్కారు కీలక చర్యకు అవకాశం ఉందన్న అభిప్రాయానికి బలం చేకూరేలా ఉందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News