2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ - రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి దిశా నిర్దేశం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో 2 రోజులపాటు పర్యటించనున్నారు. అందులో భాగంగా నేడు రాహుల్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంతో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి అవమానం జరిగింది. రాహుల్ కు స్వాగతం పలికేందుకు వెళ్లిన జైపాల్ కు చేదు అనుభవం ఎదురైంది. శంషాబాద్ విమానాశ్రయంలోకి జైపాల్ ను పోలీసులు అనుమతించలేదు. పీసీసీ తయారు చేసిన 12 మంది జాబితాలో జైపాల్ పేరు లేదని...ఆయనను విమానాశ్రయంలోని అనుమతించలేదు. జానారెడ్డిని లోపలకు పంపి - జైపాల్ ను బయటే నిలిపివేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతను పోలీసులు ఇలా అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, బీదర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం రాహుల్ హైదరాబాద్ కు తిరిగివస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ హాల్ లో మహిళా స్వయం సహాయక బృందాలతో భేటీ అవుతారు. అనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ బేగంపేటలోని హరిత ప్లాజాలో బస చేయనున్నారు. మరోవైపు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్ సభకు తెలంగాణ సర్కార్ అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ సభ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశరు. మరి ఈ నేపథ్యంలో ఆ సభ జరుగుతుందా లేదా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో రాహుల్ పర్యటనను సీఎం కేసీఆర్ - టీఆర్ ఎస్ శ్రేణులు నిశితంగా గమనిస్తున్నాయి.