ఈ ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులూ ప్రయోగిస్తోంది!

Update: 2015-03-19 05:05 GMT
తెలంగాణలోని పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీ తన సర్వశక్తులూ ఒడుతోంది. ఎలాగైనా గెలవాలనే తాపత్రయాన్ని కనబరుస్తోంది. ఏకంగా కేంద్రమంత్రులు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో దిగి కష్టపడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

    పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో జరిగే ఈ శాసన మండలి ఎన్నికల గురించి సామాన్య జనాలకు పెద్ద ఆసక్తి ఉండదు. కనీసం గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు మాత్రమే ఓటేసే అవకాశం ఉండటంతో.. ఆ విద్యార్హత లేని వారికి ఈ ఎన్నికల్లో పాల్గొనే అవకాశమే ఉండదు.

    ఇక గ్రాడ్యుయేట్లలో కూడా ఈ ఎన్నికలపై అంత ఆసక్తి లేదు. ఎవరో అమితాసక్తిని కలిగిన వారు మాత్రమే ఈ ఎన్నికలకై ఓటు నమోదు చేయించుకొంటారు. ఇలా ప్రత్యేకంగా ఓటు నమోదు చేయించుకోవాల్సి ఉండటం వల్ల ఈ ఎన్నికల విషయంలో ఆసక్తి తగ్గిపోతోంది.

    అయితే జనాలకు ఆసక్తిలేని ఈ ఎన్నికలలో మాత్రం పార్టీలో హోరాహోరీగా పోరాడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ తరపున అయితే.. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్‌లు తెలంగాణ పరిధిలోని జిల్లాల్లో తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించమని కోరుతున్నారు.

    వీరు మాత్రమే కాదు.. కర్ణాటక నుంచి వచ్చి సదానందగౌడ  కూడా తెలంగాణలో ఎమ్మెల్సీల ఎన్నికల ప్రచారం చేసి వెళ్లాడు! ఈ విధంగా భారతీయ జనతా పార్టీ తన సర్వశక్తులనూ ప్రయోగిస్తోంది. ఇక లోకల్‌ ఫేమ్‌ కిషన్‌ రెడ్డి ప్రచారంలో తీవ్రంగానే కష్టపడుతున్నాడు.

    ఇతర పార్టీలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీనే ఇలా చాలా ఎక్కువగా కష్టపడుతోంది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో!
Tags:    

Similar News