ఢిల్లీలో బీజేపీపై సమరం..తెలంగాణలో కాంగ్రెస్ లో చీలిక.. కేసీఆర్ సారూ భలే వ్యూహం

Update: 2022-03-22 01:30 GMT
తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల మాటేమిటో గానీ.. వ్యూహాలు పదునెక్కుతున్నాయి. ఏ పార్టీకి చెందినవారు ఆ పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు. ముందస్తు కాకున్నా.. ఎన్నికలకు మహా అయితే ఏడాదిన్నరే ఉండడంతో అంతా సమర సన్నద్ధత మొదలుపెట్టారు. కాగా, ఎన్నికలంటేనే ఎత్తుగడలు.. వాటిని సరిగా వేయకుంటే బొక్కబోర్లా పడడం ఖాయం. 2018 ముందస్తు ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ సరైన స్టెప్ వేసి మహా కూటమిని మట్టికరిపించారు. కాంగ్రెస్ కు బద్ధ వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ.. అదే పార్టీతో జట్టు కట్టడాన్ని ఆయన భలే అందిపుచ్చకున్నారు. దీనికితోడు తెలంగాణ సమాజంలో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకున్నారు. కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు పాలన మళ్లీ రానుందని ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకున్నారు. దీనికితోడు రైతు బంధు వంటి బ్రహ్మాండమైన పథకాన్ని తెరపైకి తెచ్చి సీట్లు కొల్లగొట్టారు.

నాడు అలా.. నేడు ఇలా..2018 నాటికి రాష్ట్రంలో బీజేపీ అసెంబ్లీ శక్తి సున్నా. జాతీయ రాజకీయాల భావోద్వేగంతో బీజేపీ లోక్ సభ సీట్లు గెలుచుకున్నా.. అసెంబ్లీకి వచ్చేసరికి అదేమీ కనిపించకపోయేది. మహా అయితే రెండు, మూడు సీట్లు అన్నట్లుండేది. ఇదేవిధంగా 2018లో కేవలం గోషామహల్ సీటును మాత్రమే ఆ పార్టీ గెలవగలిగింది. 100 సీట్లలో డిపాజిట్ కోల్పోయిందని కేసీఆర్ అందుకే ఎద్దేవా చేస్తుంటారు. కాగా,
రాజకీయాలంటే గెలుపోటములు సహజం. ఇప్పుడు 100 సీట్లు గెల్చుకున్న టీఆర్ఎస్ 2009 ఎన్నికల్లో 10 సీట్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే, ఎంత గట్టిగా కిందపడితే అంత వేగంగా పైకి లేవాలన్న సూత్రంతో పనిచేసి తెలంగాణ సాధించడమే కాక అధికారాన్నీ హస్తగతం చేసుకుంది.

సారు వ్యూహం భలే..రాజకీయాల్లో ప్రస్తుతం మహా మేధావి ఎవరంటే తెలంగాణ సీఎం కేసీఆరే. ఆయన వ్యూహాలకు ప్రత్యర్థి పార్టీల దగ్గర సమాధానాలే ఉండవు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలకు తనదైన శైలిలో వ్యూహాన్ని ఆయన ఇప్పటినుంచే ఎంచుకుంటున్నారు. ఇందుకుతగ్గట్లు పావులు కదుపుతున్నారు. చాలాకాలం క్రితమే మరుగునపడిన వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చారు.

సీఎం ఫామ్ హౌస్లో అత్యవసర సమావేశం నిర్వహించి కదనానికి కాలుదువ్వారు. వాస్తవానికి యాసంగి ధాన్యం కొనుగోలుపై కొంత సందిగ్ధత ఉంది. ఖరీఫ్ ధాన్యం విషయంలోనే తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లి భంగపడి వచ్చారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ అదే అంశాన్ని పట్టుకుని కేంద్రాన్ని బద్నాం చేయాలని కేసీఆర్ నిర్ణయించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ప్రయోజనాలను అడ్డుకుంటోందని ప్రజల్లో చర్చ జరిగేలా చేయడమే కేసీఆర్ ఉద్దేశం. ఎలాగూ ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పెట్రో ధరలు, పలు ఇతర అంశాల కారణంగా మోదీని ప్రజలు నిలదీసే పరిస్థితి వచ్చింది.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికలవిజయాలు కేవలం స్థానిక పరిస్థితులే తప్ప కేంద్ర ప్రభుత్వం పనితీరుకు కాదు. ఇకపోతే, దీనినే ఆయుధంగా తీసుకుని కేసీఆర్.. సమరానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ బండి సంజయ్ సారథ్యంలో బలపడింది. ఈ క్రమంలో ఇక్కడ ఎంత ఒత్తిడి తెచ్చినా సంజయ్, రాష్ట్ర బీజేపీకే మేలు. కాబట్టి ప్రజా కోణం అందులోనూ రైతు ప్రయోజనం అంశంలో కేంద్రాన్ని నిలదీసేందుకు కేసీఆర్ ప్లాన్ వేశారు. అలాగైతే రెండు ప్రయోజనాలు నెరవేరతాయనేది ఆయన వ్యూహం.

కాంగ్రెస్ లో కిరికిరి వెనుక ఉన్నదెవరు?ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా వచ్చాక దూకుడు మీదుంది. మన ఊరు సభలతో ఆయన రాష్ట్రం నలుమూలలకూ వెళ్తున్నారు. కొల్లాపూర్ లో గతవారం, ఈవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే, సంస్థాగతంగా పటిష్ఠమైన కాంగ్రెస్ ప్రజాదరణతోనూ బలపడితే అసలుకే మోసమని కేసీఆర్ పసిగట్టారు.

ఎలాగూ గ్రూపులు గ్రూపులుగా ఉండే ఆ పార్టీని చికాకు పెట్టడం సులువే. అందుకనే, రేవంత్ నాయకత్వంపై వ్యతిరేకత ఉన్నవారిని ప్రేరేపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే సీనియర్ నేతల భేటీలు సాగుతున్నట్లు కనిపిస్తోంది. వీరిలో ఓ సీనియర్ నేత ఏకంగా మంత్రి హరీశ్ రావును కలవడం మరింత ప్రాధాన్యం  సంతరించుకుంది. అంటే.. కేంద్రంలో బీజేపీని ఓ కోణంలో.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను మరో కోణంలో కేసీఆర్ టార్గెట్ చేస్తూ తన పని సులువు అయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ సీనియర్లు పదిరోజుల కిందట కూడా సమావేశమయ్యారు. ఈ ఆదివారం కూడా కొంత కలకలం రేపారు. కానీ, ఇదేదో అసలుకే మోసంలా ఉందని గ్రహించిన అధిష్ఠానం వారిని మందలించింది. తద్వారా కేసీఆర్ ఉచ్చులో పడకుండా ప్రస్తుతానికి నిలువరించింది.
Tags:    

Similar News