ఇంతకీ పవన్ను ఏమి మాయ చేయబోతున్నారో ?

Update: 2020-12-10 17:30 GMT
మీటింగులు మీద మీటింగులు పెడుతున్న బీజేపీ నేతలు జనసేన అధినేతను ఏమి చేయబోతున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. మీటింగులు పెడుతున్నారే కానీ తిరుపతి లోక్ సభలో పోటీ చేసే విషయం మాత్రం తేల్చటం లేదు. తాజాగా హైదరాబాద్ లో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు+జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య పెద్ద భేటీనే జరిగింది. అంటే రెండు వైపులా మరికొంతమంది నేతలు కూడా పాల్గొన్నారు లేండి. అనేక విషయాలపై సమావేశంలో చర్చించారు కానీ కీలకమైన తిరుపతి లోక్ సభ సీటు విషయాన్ని మాత్రం చర్చించలేదట.

వినటానికే విచిత్రంగా ఉంది విషయం. ఎందుకంటే రెండు పార్టీల మధ్య అసలు విషయమే తిరుపతిలో లోక్ సభలో పోటీ చేయటం. రెండు పార్టీలు కూడా పోటీ చేసే అవకాశం తమకే దక్కాలంటే కాదు తమకే దక్కాలంటూ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో రెండు నెలల క్రితమే బీజేపీనే పోటీ చేయబోతోందంటూ వీర్రాజు చేసిన ఏకపక్ష ప్రకటనతోనే మిత్రపక్షాల మధ్య నిప్పు రాజుకుంది.

ప్రకటన చేసి ఊరుకోకుండా వీర్రాజు జనసేనానిపై మైండ్ గేమ్ మొదలుపెట్టారు. ఎక్కడెక్కడి నేతలను తిరుపతికి పిలిపించి తమ పార్టీకి అనుకూలంగా కార్యక్రమాలు పెట్టించటమే కాకుండా ప్రకటనలు కూడా ఇప్పించారు. దాంతో పవన్ కూడా స్పీడయ్యారు. సరే పార్టీల కార్యక్రమాలు, ప్రకటనలను పక్కన పెట్టేస్తే అసలు పవన్ తో మీటింగులు పెడుతున్న వీర్రాజు తిరుపతి లోక్ సభలో పోటీ విషయమై ఎందుకు ప్రస్తావించటం లేదు ? అన్నదే అర్ధం కావటం లేదు.

మొన్నటికి మొన్న తిరుపతిలో పర్యటించిన సమయంలో కూడా బీజేపీ నేతలు పవన్ను కలిశారు. లోక్ సభ పరిధిలో రెండుపార్టీలకున్న బలాలను వివరించారు. మొన్నటి ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ పరిధిలోని అసెంబ్లీల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయాన్ని వివరించారు. అసలు ఇదంతా బీజేపీ నేతలు ఎందుకు చేస్తున్నట్లు ? తాజా మీటింగులో కూడా పోటీ విషయం చర్చకు వచ్చినపుడు ఇప్పుడే తొందరేమి వచ్చిందంటు వీర్రాజు చర్చను పక్కకు పెట్టేశారట. ఇదంతా చూస్తుంటే బీజేపీ నేతలు పవన్ను ఏదో మాయ చేయటానికే ప్రయత్నిస్తున్నట్లు అనుమానంగా ఉంది.
Tags:    

Similar News