రూ.30 కోట్ల డీల్‌.. ఆ బాబా నుంచేనా?

Update: 2021-03-02 09:30 GMT
ఒక‌టి కాదు.. ప‌ది కాదు.. ఏకంగా 30 కోట్ల రూపాయ‌ల‌ను బీజేపీ నేత‌లు అడ్డంగా బొక్కేశారా?  ఓ ప్ర‌ముఖ ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహ‌కులకు చెందిన `పెద్ద డీల్‌` చ‌క్క‌బెట్టేందుకు 30 కోట్ల‌ను నొక్కేశారా? అంటే.. తిరుప‌తి మాజీ ఎంపీ.. కాంగ్రెస్ నాయ‌కుడు చింత మోహ‌న్ వెల్ల‌డించిన వివారాల‌ను బ‌ట్టి ఔన‌నే సందేహాలు వ‌స్తున్నాయి. దీంతో ఒక్క‌సారిగా అటు బీజేపీ నాయ‌కులు.. ఇటు సాధార‌ణ‌ప్ర‌జ‌లు కూడా ఉలిక్కిప‌డుతున్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ అక్ర‌మాలను స‌హించేది లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టే బీజేపీ క‌మ‌లానికి ఇప్పుడు అవినీతి మ‌కిలి ద‌ట్టంగా అంటుకుంద‌నే విమ‌ర్శ‌ల వ‌స్తున్నాయి.

చింత మోహ‌న్ వెల్ల‌డించిన వివ‌రాల‌ను బ‌ట్టి.. చిత్తూరు జిల్లాలోని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక కేంద్రం క‌ల్కి భ‌గ‌వాన్ ఆశ్ర‌మంపై కొన్నాళ్ల కింద‌ట ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ క్ర‌మంలో లెక్క‌లు చూపించ‌ని.. సుమారు 400 కోట్ల రూపాయ‌ల‌ను అధికారులు గుర్తించారు. ఈ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. ఆ త‌ర్వాత కొన్నాళ్లకు ఈ విష‌యం మ‌రుగున ప‌డింది. అయితే.. త‌ర్వాత‌ ఈ విష‌యంలో బీజేపీ నేత‌లు రంగంలోకి దిగారు.  బాబా ఆశ్ర‌మంలో దొరికిన ఆదాయానికి మించిన ఆస్తుల విష‌యంలో కేసులు న‌మోదు చేయ‌కుండా.. అస‌లు విష‌యం ఇంత‌టితో ఆగిపోయేలా చేస్తామంటూ.. చ‌క్రం తిప్పారని.. మోహ‌న్ వ్యాఖ్యానించారు.

మొత్తం ఈ  వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు 30 కోట్ల రూపాయలకు డీల్‌ కుదుర్చుకున్నార‌ట‌. జనవరి-ఫిబ్రవరి మధ్య జరిగిన ఈ వ్యవహారంలో స‌ద‌రు బాబా నుంచి రూ.30 కోట్లు తీసుకున్న‌ట్టు మోహ‌న్ ఆరోపించారు. అయితే.. అక్ర‌మంగా డీల్ కుద‌ర్చ‌డ‌మే కాకుండా.. రూ.30 కోట్ల‌ను తీసుకున్న ఆ ఇద్ద‌రు కీల‌క‌ నేత‌ల‌ను కూడా బీజేపీ నాయ‌కులు దాచిపెడుతున్నార‌ని.. వారి పేర్లు త‌క్ష‌ణ‌మే బ‌య‌ట పెట్టాల‌ని చింతా మోహ‌న్ డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. బీజేపీపెద్ద‌ల‌కు ఆయ‌న డెడ్‌లైన్ విధించారు. త్వ‌ర‌లోనే బీజేపీ ఆ అక్ర‌మ నేత‌ల పేర్లు వెల్ల‌డించ‌క‌పోతే.. తానే బ‌య‌ట పెడ‌తాన‌ని కూడా హెచ్చ‌రించారు. మొత్తానికి ఈ వ్య‌వ‌హారం.. రాష్ట్ర బీజేపీకి పెద్ద త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మిస్తే.. కేంద్రంలోని బీజేపీ నేత‌లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నే విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.
Tags:    

Similar News