కాంగ్రెస్ ట్రాప్ లో ఈ మ‌హిళా మంత్రి ప‌డ్డారా?

Update: 2022-07-25 04:50 GMT
గ‌త పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని అమేథి నుంచి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై సంచ‌ల‌న విజ‌యం సాధించి జెయింట్ కిల్ల‌ర్ గా నిలిచారు.. స్మృతి ఇరానీ. హిందీ టీవీ సీరియ‌ళ్ల ద్వారా అత్యంత పాపుల‌రైన స్మృతి ఇరానీ బీజేపీలో మంచి వ‌క్త‌గా పేరుగాంచారు. ఈ నైపుణ్య‌మే ఆమెను 2014 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కేంద్ర కేబినెట్ మంత్రిగా స్థానం ద‌క్కేలా చేసింది.

ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌పై విరుచుకుప‌డటంలో స్మృతి ఇరానీ త‌ర్వాత ఎవ‌రైనా. ఈ నేప‌థ్యంలో 2019లో అమేథిలో రాహుల్ ను ఓడించి పెను సంచ‌ల‌న‌మే సృష్టించారు. ఎందుకంటే అమేథి కాంగ్రెస్ కంచుకోట‌. రాహుల్ గాంధీ పెద నాన్న సంజ‌య్ గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, త‌ల్లి సోనియాగాంధీ ప‌లుమార్లు అమేథి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులుగా గెలుపొందారు. రాహుల్ కూడా 2004, 2009, 2014ల్లో అమేథి నుంచి విజ‌యం సాధించారు.

కాగా గ‌తంలో హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూన‌వ‌ర్సిటీ విద్యార్థి రోహిత్ శ‌ర్మ ఆత్మ‌హ‌త్య విష‌యంలో స్మృతి ఇరానీ కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రిగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. దేశ‌స్థాయిలో చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యారు. ఇప్పుడు మ‌రోమారు స్మృతి వివాదంలో చిక్కుకున్నారు.

స్మృతికి డిగ్రీ చ‌దువుతున్న 18 ఏళ్ల కుమార్తె జోయిష్ ఇరానీ ఉంది. ఈ యువ‌తి గోవాలో సిల్లీ సోల్స్ బార్ అండ్ రెస్టారెంట్ ను న‌డుపుతున్నార‌ని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. ఇందుకోసం ఎప్పుడో మ‌ర‌ణించిన వ్య‌క్తి పేరుతో మోస‌పూరిత ప‌ద్ధ‌తుల్లో మ‌ద్యం లైసెన్సు తీసుకున్నార‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇందుకోసం స్మృతి ఇరానీ మంత్రిగా చ‌క్రం తిప్పార‌నేది కాంగ్రెస్ ఆరోప‌ణ‌.

అందులోనూ స్మృతి ఇరానీ కాంగ్రెస్ అధినాయ‌క‌త్వాన్ని ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిసారి విమ‌ర్శ‌లు చేస్తుండ‌టంతో కాంగ్రెస్ నేత‌లు ఈసారి ఆమెను కాస్త గ‌ట్టిగానే తగులుకున్నారు. గోవాలో 18 ఏళ్ల కూతురితో బార్ నిర్వ‌హిస్తోంద‌ని.. ఇందుకోసం ఎప్పుడో చ‌నిపోయిన వ్య‌క్తి పేరుతో లైసెన్సు తీసుకున్నార‌ని ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది.

మ‌రో వైపు స్మృతి కూడా ఏమాత్రం త‌గ్గ‌కుండా కాంగ్రెస్ నేత‌ల‌కు కౌంట‌ర్లు వేస్తున్నారు. తాను సోనియా, రాహుల్ ను విమ‌ర్శిస్తున్నాన‌నే కార‌ణంతోనే కాంగ్రెస్ నేత‌లు త‌న కుమార్తెను వివాదంలోకి లాగుతున్నార‌ని ప్ర‌త్యారోప‌ణ‌లు చేస్తున్నారు. త‌న కుమార్తెకు 18 ఏళ్లు అని, డిగ్రీ చ‌దువుతుంద‌ని.. ఒక అమాయ‌క యువ‌తిపై కాంగ్రెస్ నీచ‌మైన విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ నేత‌ల‌కు ఆమె లీగ‌ల్ నోటీసులు పంపారు.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ఆరోప‌ణ‌ల‌కు ప‌దే పదే మీడియా ముందుకొచ్చి వివ‌ర‌ణ‌లు ఇవ్వ‌డం ద్వారా స్మృతి ఇరానీ ఆ పార్టీలో ట్రాప్ లో చిక్కార‌ని అంటున్నారు. ఒక బార్ న‌డ‌ప‌డం పెద్ద త‌ప్పేమీ కాదు. ఇందులో ఎవ‌రికి వ‌చ్చిన న‌ష్ట‌మూ లేదు.. కుంభ‌కోణం కాదు. కాకుంటే చ‌నిపోయిన వ్య‌క్తి పేరుతో లైసెన్సు తీసుకుని బార్ న‌డుపుతున్నార‌న్న అతి చిన్న ఆరోప‌ణ మాత్ర‌మే కాంగ్రెస్ చేస్తోంది.

అయితే స్మృతి ఇరానీ మాత్రం ఈ వివాదాన్ని పెద్ద‌ది చేసుకుని న‌ష్ట‌పోతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. ప‌దే ప‌దే ఈ అంశంపై మీడియా స‌మావేశాలు పెట్ట‌డం, కాంగ్రెస్ నేత‌ల‌కు లీగ‌ల్ నోటీసులు ఇవ్వ‌డం త‌దిత‌రాలు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. త‌ద్వారా స్మృతి త‌న కుమార్తెను తానే అల్ల‌రి చేసుకుంటున్నార‌ని చెబుతున్నారు. మ‌రి ఈ చిన్న విష‌యాన్ని స్మృతి గుర్తిస్తారో లేదో వేచిచూడాల్సిందే.
Tags:    

Similar News