బీజేపీకి షాక్‌...ఎమ్మెల్యే పై అన‌ర్హ‌త వేటు..!

Update: 2019-11-03 17:57 GMT
అధికారం లో కోల్పోయిన రాష్ట్రంలో బీజేపీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఇటీవ‌ల అధికారం కోల్పోయిన‌ మధ్యప్రదేశ్‌ లో బీజేపీకి చెందిన పవాయి ఎమ్మెల్యే ప్రహ్లాద్‌ లోధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు రాష్ట్ర అసెంబ్లీ సచివాలయం ప్రకటించింది. ఓ క్రిమినల్‌ కేసులో ఆయన దోషిగా ఖరారైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్‌ పీ ప్రజాపతి ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

2014లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్‌ ను జప్తు చేసిన రాయ్‌పురా తాసిల్దార్‌ ఆర్కే వర్మపై లోధీ మరో 12మంది దాడి చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన భోపాల్‌ కోర్టు లోధీతోపాటు మరో 12 మందికి రెండు సంవ‌త్స‌రాల‌ జైలు శిక్ష విధించింది. దీంతో లోధి ప‌ద‌వి ఊడిపోయింది. అసెంబ్లీ స్పీకర్‌ ఎన్‌పీ ప్రజాపతి ఈ నిర్ణ‌యం గురించి వివ‌రిస్తూ...తాము సుప్రీంకోర్టు తీర్పును అనుస‌రించి నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. నేరారోప‌ణ‌ల‌పై ప్రజా ప్రతినిధి దోషిగా నిర్ధారితుడై రెండు సంవ‌త్స‌రాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలుశిక్షకు గురైతే వారిపై వెంటనే అనర్హత వేటువేయాలని సుప్రీంకోర్టు రూలింగ్‌ ఇచ్చిందని - దాని ప్రకారమే తాను లోధీ విషయంలో నిర్ణయం తీసుకున్నానని  తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి కూడా నివేదించామ‌ని వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా - స్పీక‌ర్ నిర్ణ‌యంపై బీజేపీ మండిప‌డింది. అసెంబ్లీ స్పీక‌ర్‌ నిర్ణయం అ ప్రజాస్వామికమని - తాము కోర్టులో సవాలు చేస్తామని బీజేపీ తెలిపింది. లోథిని అనర్హుడిగా ప్రకటిస్తూ.. అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని  బీజేపీ అధ్యక్షుడు రాకేష్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉన్నత స్థానంలో ఉండాల్సిన స్పీకర్.. పూర్తిగా కాంగ్రెస్ మనిషిగా వ్యవహరించారని రాకేష్ సింగ్ ఆరోపించారు.
Tags:    

Similar News