కేసీఆర్ పై బీజేపీ పకడ్బందీ వ్యూహం ?

Update: 2022-01-10 08:27 GMT
కేసీఆర్ పై కమల నాధులు చాలా జాగ్రత్తగా మైండ్ గేమ్ మొదలుపెట్టారు. ముందస్తు ఎన్నికలు వస్తాయో రావో తెలీదు కానీ బీజేపీ నేతలు మాత్రం ఈరోజో రేపో తెలంగాణాలో ఎన్నికలు వచ్చేయబోతున్నట్లు  డిసైడ్ అయినట్లే ఉన్నారు. అందుకనే కేంద్ర మంత్రులను, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలంగాణాకు పిలిపిస్తున్నారు. వారంతా ఇక్కడ మీటింగులు పెట్టడం, కేసీయార్ ను నానా బూతులు తిట్టి నానా గోల చేసి వెళుతున్నారు.

పదే పదే కేసీయార్ కు చాలెంజిలు విసురుతున్నారు. రేపో మాపో కేసీయార్ ను జైల్లోకి తోయటం ఖాయమని పెద్ద పెద్ద వార్నింగులు ఇస్తున్నారు. ఐదు రోజుల క్రితం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చారు. మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ వచ్చారు. తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వచ్చారు. కేసీయార్ నియంతృత్వం చెల్లదన్నారు. పోలీసులతో ఎంతకాలం పరిపాలిస్తారంటు నిలదీశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే కమలనాథులు ఏఏ అంశాల్లో అయితే కేసీయార్ ను తప్పుపడుతున్నారో అవే అంశాలు నరేంద్రమోడికి కూడా వర్తిస్తాయి.

ఇప్పటికే తెలంగాణా చీఫ్ బండి సంజయ్ అండ్ కో ప్రతిరోజు ఏదో కారణంతో కేసీయార్ కు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలంటు రచ్చ రచ్చ చేస్తున్నారు. వీళ్ళు సరిపోరన్నట్లు బయట రాష్ట్రాల నుంచి కూడా పిలిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే మామూలు జనాల్లో చాలామందికి లేదు. ఎందుకంటే పై స్థాయిలో కొందరు నేతలున్నా క్షేత్రస్థాయిలో పనిచేయటానికి అవసరమైన క్యాడర్ లేదు.

అధికారంలోకి వస్తుందో లేదో తెలీకపోయినా అధికారంలోకి వచ్చేది తామే పక్కా అంటూ హడావుడి మాత్రం చాలా ఎక్కువగా చేస్తున్నారు. పోయిన ఎన్నికల్లో 119 సీట్లలో బీజేపీ పోటీ చేస్తే గెలిచింది ఒకే ఒక్క సీటులో. మిగిలిన సీట్లలో కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కేసీయార్ చేసిన తప్పుల కారణంగా దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీల్లో గెలిచింది. మధ్యలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించింది.

అయితే ఇదే సమయంలో జరిగిన నాగార్జునసాగర్ అసెంబ్లీ, ఎంఎల్సీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఏదేమైనా కేసీయార్ పైన మైండ్ గేమ్ మాత్రం మ్యాగ్జిమమ్ ఆడేస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ఇమేజీయే తమను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తుందనో లేకపోతే కేసీయార్ పై వ్యతిరేకత వల్లే తాము గెలుస్తామనో అనుకుంటున్నారు. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News