జగన్ తో బీజేపీ రాజకీయ సయ్యాట

Update: 2022-10-06 00:30 GMT
ఏపీలో జగన్ రాజకీయ అప్రతిహతంగా సాగిపోతే నష్టం టీడీపీ అధినాయకుడు నారా  చంద్రబాబుకే కాదు   వైసీపీతో పరోక్ష మైత్రిని గడుపుతో ఆ విషయాన్ని చెప్పకనే  చెబుతూ తన  పబ్బం గడుపుకుంటున్న బీజేపీకి కూడా. నిజానికి చంద్రబాబు ఆరాటం అంతా ఏపీ వరకే. కానీ బీజేపీ తాపత్రయం, రాజకీయ దాహం దేశమంత పెద్దది. దానికి అంతూ పొంతూ లేదు. ఇప్పటికే బాబుని ఓల్డ్ మాన్ కింద జమ కట్టి టీడీపీ పని సరి అని బీజేపీ భావిస్తున్న వేళ యంగ్ టర్క్ గా ఏపీలో జగనే కళ్ల ముందుటారు. ఆయన్ని దాటుకుని వెళ్తే కదా ఏపీ పగ్గాలు బీజేపీకి చిక్కేది.

అందువల్ల బీజేపీ ఫస్ట్ టార్గెట్ చంద్రబాబు అయినా జగన్ని మాత్రం ఎలా స్థిమితంగా ఉండనిస్తుంది. ఇప్పటికే ఏపీలో ప్రత్యేక హోదా లేదు, పోలవరం పూర్తి కాదు, రాజధాని అన్న ఊసే లేదు, అప్పుల ఏపీ అంటూ జనాల ముందు జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. దీని వెనక బీజేపీ కోరి అమలు చేస్తున్న పక్కా వ్యూహాలు ఉన్నాయనే అంటారు. బీజేపీ పెద్దలకు జగన్ మీద నిజంగా మిత్రుడు అని అభిమానం ఉంటే పోలవరం పూర్తికి ఏ కొర్రీలు పెట్టకుండా నిధులు సకాలంలో మంజూరు చేసేవారు కదా.

దాని వల్ల పోలవరం పూర్తి అయితే జగన్ కి రాజకీయంగా ఏపీలో పూర్తిగా  ఎదురు ఉండదు కదా. ఇక రాజధాని విషయంలో అమరావతికి లక్ష కోట్లు నిధులు అవుతాయి అని జగన్ అంటే అంత కాదు అబ్బాయి అని చెప్పి అయినా లేక  అందులో సగమైనా మేము ఇస్తాం అని భరోసా ఇచ్చి అయినా  ఏకైక రాజధాని అమరావతే అని అపుడు గట్టిగా బల్ల గుద్ది చెపితే బీజేపీకి ఏపీలో విలువ పెరిగేది. మూడు రాజధానుల గొడవ కూడా అసలు ఉండేది కాదు,

అమరావతి ఒక రూపునకూ షేపునకూ వచ్చేది. కానీ టీడీపీ ఏలుబడిలో జస్ట్ పదిహేను వందల కోట్ల రూపాయలను  విదిలించి దానికి కూడా జమా ఖర్చుల వివరాలు ఆతరువాత వచ్చిన జగన్ని కేంద్ర పెద్దలు అడుగుతున్నారు అంటే బాబు మాదిరిగా జగన్ని కూడా జనంలో బదనాం చేయడానికే కదా.

ఇక బాబు అయితే ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజి ముద్దు అన్నారు కాబట్టి అలా చేశామని చాలా బుద్ధిగా  చెప్పిన బీజేపీ పెద్దలు జగన్ ప్రత్యేక హోదావే కావాలని కోరుతున్నారు కదా దాన్ని కనుక ఇస్తే ఏపీలో తమ మిత్రుడే రాజకీయంగా రాణిస్తాడు కదా అన్న ప్రేమ ఉందా. అందుకే జస్ట్ జగన్ తో అవసరాలు తీర్చుకుంటూ సరైన టైం చూసి దెబ్బ కొట్టాలనే బీజేపీ ఆలోచిస్తోంది. ఈ కారణం వల్లనే ఏపీకి విభజన హామీలు కూడా నెరవేర్చడం లేదు.

తెలంగాణాలో మొత్తం ఏపీ ఆస్తులు ఉన్నా వాటికి నష్ట పరిహారం కట్టి ఏపీకి ఇచ్చినా అప్పుల తిప్పలు ఎంతో కొంత తప్పేవి. కానీ అవేమీ చేయకుండా ఏపీని అప్పుల పాలు చేస్తున్నారు అని విమర్శలు మాత్రం లంకించుకుంటుంది. విభజన గాయాల పాలు అయిన ఏపీకి పోనీ ప్రత్యేక నిధులు ఏమైనా  ఇస్తున్నారా అంటే అది కూడా లేదు కదా.  దీంతోనే బీజేపీకి జగన్ మీద నిజంగా ప్రేమ ఉందా అంటే ఎవరు నమ్ముతారు అనే అంటారు. పైగా చంద్రబాబుతో పొత్తు లేదు అంటూనే కన్ను కొడతారు. ఒక వైపు పవన్ మిత్రుడు అని చెబుతూనే  ఆయన అన్న మెగాస్టార్ ని ముగ్గులోకి లాగే ప్రయత్నం చేస్తారు.

మొత్తానికి ఆశ లావు పీక సన్నం అన్నట్లుగా బీజేపీకి అత్యాశ ఎక్కువ. అది రాజకీయ అత్యాశ. అయితే ఈ అత్యాశ వల్ల బీజేపీకి పోయేది ఏమీ లేదు కానీ మిగిలిన పార్టీలతో ఆడుతున్న రాజకీయ జూదంతో ఏపీ జనాలే నష్టపోతున్నారు. మొత్తానికి బీజేపీ తనకు మిత్రుడా శత్రువా అని జగన్ కానీ ఆయన పార్టీ కానీ ఆలోచిస్తే జవాబు మాత్రం ఇట్టే ఈజీగా  దొరుకుతుంది అని అంటున్నారు. ప్రాంతీయ పార్టీలు వద్దు, కుటుంబ రాజకీయాలు అసలు చెల్లవని చెబుతున్న బీజేపీకి జగన్ మాత్రం ఎందుకు ముద్దు అవుతారు అని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.

అయితే తన రాజకీయ అవసరాల కోసమే జగన్ కూడా కేంద్రంతో దోస్తీ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక్కడ దోస్తీ చేయడం వరకే జగన్ ఇష్టం కానీ దాన్ని తెగ్గొట్టుకోవడం ఆయన చేతుల్లో లేదు. ఏం చేసినా బీజేపీ బడా నాయకత్వమే చేయాలి. ఆ రోజున ఏ రకమైన రాజకీయ సర్దుబాటు కానీ సరైన ఆల్టర్నేషన్ లేకపోతే కనుక పూర్తిగా   చతికిలపడితే వైసీపీదే ఆ తప్పు.   కానీ ఎక్కడా బీజేపీది మాత్రం కాదండోయ్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News