న‌డ్డాకు ఆ రాష్ట్రంలో మిత్ర‌ప‌క్షం షాక్!

Update: 2022-07-31 11:36 GMT
భార‌తీయ జ‌నతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాకు కాలం అస్స‌లు క‌లిసి రావ‌డం లేదు. ఆయ‌న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అయిన‌ప్ప‌టి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతూనే ఉన్నాయి. గ‌తంలో పశ్చిమ బెంగాల్ లో ప‌ర్య‌టించిన‌ప్పుడు ఆయ‌న కాన్వాయ్ పై దాడి జ‌రిగింది. సరే అక్క‌డంటే బీజేపీ వ్య‌తిరేక తృణ‌మూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంద‌ని స‌రిపెట్టుకున్నా.. తాజాగా బిహార్ లో న‌డ్డాకు ఇచ్చిన షాక్ మాత్రం మ‌రిచిపోలేనిద‌ని అంటున్నారు.

ఎందుకంటే బిహార్ లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. బీజేపీ- జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ క‌ల‌సి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్న‌ప్ప‌టికీ జేడీయూకి చెందిన నితీష్ కుమార్ ని ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టింది.

అలాంటి బిహార్ లో జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురైంది. బిహార్ పర్యటనలో భాగంగా అక్క‌డి విద్యార్థులు జేపీ నడ్డా వాపస్‌ జావో అంటూ నినాదాలు చేశారు. ఇది నిజంగా బీజేపీకి షాకేన‌ని చెబుతున్నారు.

 బిహార్ రాజ‌ధాని పాట్నాలో రెండు రోజులపాటు జరుగనున్న బీజేపీ ఫ్రంట్‌ల సదస్సుల్లో పాల్గొనేందుకు జేపీ న‌డ్డా వ‌చ్చారు. ఆయ‌న వ‌చ్చార‌న్న విష‌యం తెలుసుకున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) కార్యకర్తలు సదస్సు జరుగుతున్న ప్రాంతం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి త‌మ నిరసనలు తెలియ‌జేశారు. అంతేకాకుండా మ‌హిళ‌లు సైతం జేపీ న‌డ్డాను చుట్టుముట్టారు. ఈ క్రమంలో వారు నడ్డాను అడ్డుకున్నారు. జేపీ నడ్డా వాపస్‌ జావో అంటూ గ‌ట్టిగా నినాదాలు చేస్తుండ‌టంతో ఒక్క‌సారిగా అక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొంది. జాతీయ విద్యా విధానం-2020ని వెనక్కి తీసుకోవాలని, పాట్నా విశ్వ‌విద్యాల‌యానికి సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ స్థాయి హోదా కల్పించాలని విద్యార్థులు పెద్ద పెట్టున‌ నినాదాలు చేశారు.

భద్రతా సిబ్బంది అండ‌గా ఉండ‌టంతో జేపీ నడ్డా కార్య‌క్ర‌మం నుంచి వెళ్లిపోయారు. బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ అధికారంలో ఉన్న బిహార్ లోనే జేపీ న‌డ్డాకు నిర‌స‌న‌లు ఎదురుకావ‌డంపై ఆ పార్టీ నేత‌లు నితీష్ కుమార్ ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నారు. రాష్ట్రంలో ఏం జ‌రుగుతుందో క‌నిపెట్ట‌లేక‌పోయింద‌ని నిప్పులు చెరుగుతున్నారు. ఇంటెలిజెన్స్ వైఫ‌ల్యం చెందింద‌ని బీజేపీ నేత‌లు ధ్వ‌జమెత్తారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి అధ్య‌క్షుడైన వ్య‌క్తి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతుంటే సాదాసీదాగా ప్ర‌భుత్వం ప‌రిగ‌ణించింద‌ని బీజేపీ నేత‌లు మండిప‌డ్డారు. బీజేపీ ద‌య‌తోనే నితీష్ కుమార్ ప్ర‌భుత్వం బిహార్ లో న‌డుస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లే రెండు పార్టీల మ‌ధ్య విభేదాల‌కు కార‌ణ‌మ‌వుతాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో బిహార్ లో బీజేపీ-జేడీయూ సంకీర్ణ స‌ర్కారులో లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.
Tags:    

Similar News