సోము వారు స‌మ‌ర్పించు.. `సిత్ర‌మైన` పాలిటిక్స్‌

Update: 2021-04-01 01:30 GMT
జోగిజోగి రాసుకుంటే.. బూడిద రాలింద‌ని సామెత‌! ఇప్పుడు అచ్చు... బీజేపీ రాష్ట్ర సార‌ధి సోము వీర్రాజు కూడా ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం తిరుపతి ఉప ఎన్నిక జ‌రుగుతోంది. మ‌రో 15 రోజుల్లో ప్ర‌చారం కూడా ముగియ‌నుంది.. ఈ క్ర‌మంలో ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కాల ‌ని పంతంపై ఉన్న బీజేపీ త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. మంచిదే.. దీనిలో ఎలాంటి అభ్యంత‌రం లేదు. ఏ పార్టీకైనా వ్యూహ ప్ర‌తివ్యూహాలు ముఖ్య‌మే. అందునా హోరా హోరీగా సాగుతుంద‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ఇక్క‌డ కీల‌క పార్టీల మ‌ధ్య నువ్వా-నేనా అనేవిధంగా ఎన్నిక‌ల వ్యూహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

అయితే... చిత్రంగా సోము వీర్రాజు మాత్రం త‌న పాత పంథానే తెర‌మీదికి తెచ్చారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఆయ‌న గ‌త 2019 ఎన్నిక‌ల్లో పార్టీ ఒక్క‌సీటును సాధించ‌లేక పోయింద‌నే ఆవేద‌న ఉండి కూడా.. దీనికి త‌గిన విధంగా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుని.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌పై పోరు చేయ‌డం మానేశారు. మ‌రీ ముఖ్యంగా తిరుప‌తి వంటి ప్రాంతంలో జ‌గ‌న్ స‌ర్కారు హ‌యాంలో జ‌రిగిన హిందూ దేవాల‌యాల‌పై దాడులను ప్రొజెక్టు చేసుకుని ఓట్లు రాబ‌ట్టుకునే వ్యూహానికి ఫుల్ స్టాప్ పెట్టేసిన‌ట్టు తెలిస్తోంది. అదేస‌మ‌యంలో ఆయ‌న ప్ర‌తిప‌క్షం టీడీపీని టార్గెట్ చేసుకున్నారు..

నిజానికి తిరుప‌తి బైపోల్‌లో పోటీ ఎవ‌రి మ‌ధ్య ఉంటుంది? ఈ ప్ర‌శ్న ఏ చిన్న వ్య‌క్తిని అడిగినా చెబుతారు. రాష్ట్ర ప్ర‌భుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ప్ర‌తిప‌క్షాలు ముందుకు సాగాలి. కానీ, ఘ‌న‌త వ‌హించిన సోము మాత్రం .. పాత చింత‌కాయ్ పచ్చ‌డి వంటి ఎప్పుడో నాలుగేళ్ల కింద‌ట కాంగ్రెస్ నేత‌గా ఉన్న ప్ర‌స్తుత టీడీపీ అభ్య‌ర్థి ప‌నబాక ల‌క్ష్మి.. అప్ప‌ట్లో చంద్ర‌బాబుపై చేసిన విమ‌ర్శ‌ల వీడియో ను త‌వ్వితీశారు. చంద్ర‌బాబును బ‌ద్నా చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఇది పూర్తిగా విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. ఎవ‌రైనా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసి, ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టి.. నాలుగు ఓట్లు పోగేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. కానీ, సోము మాత్రం పైన చెప్పుకొన్న‌ట్టు ప్ర‌తిప‌క్షాల‌ను విమ‌ర్శించ‌డంతోనే స‌రిపెడుతున్నారు. మ‌రి ఇది ఏమేర‌కు ఆయ‌నకు ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.





Tags:    

Similar News