మహా రాజకీయం : శివసేనను మింగేయనున్న బీజేపీ...?

Update: 2022-06-21 11:30 GMT
దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అన్నది బీజేపీ రాజనీతి. ప్రాంతీయ పార్టీలు ఉంటే జాతీయ భావాలకు విధానాలకు ఇబ్బంది అన్నది ఆ పార్టీ ఆలోచన. అందుకే పదే పదే బీజేపీ నేతలు ప్రాంతీయ పార్టీలను ఉద్దేశించి కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు అని అంటూంటారు. ఇక దేశంలో సీనియర్ మోస్ట్ ప్రాంతీయ పార్టీలను తీసుకుంటే  దక్షిణాన డీఎంకే, అన్నా డీఎంకే, ఉత్తరాన శివసేన వంటివి ఉన్నాయి. ఇక శివసేన 1960 దశకం చివరలో బాల్ ధాక్రే ప్రారంభించారు. ఆయన మరాఠా ఉద్య‌మానికి నాయకత్వం వహించారు.

సొంత ఉనికి అస్థిత్వం పేరిట ఆయన పురుడు పోసిన శివసేన ఆయన మరణానంతరం చాలా ఒడుదుడుకులను ఎదుర్కొంది. ఇక బాలధాకరేతోనే శివసేన ఖేల్ ఖతం అని అంతా అనుకున్నారు. నిజానికి ఆయనకు అసలైన అసలైన వారసుడు సోదరుని కుమారుడ్ రాజ్ థాక్రే. కానీ ఆయన్ని ముందే బయటకు పంపేశారు. సొంత కొడుకు ఉద్ధవ్ థాక్రేకి అంతలా పట్టు లేదు. అయినా ఆయన శివసేన వారసుడిగా బండి లాక్కొస్తున్నారు.

బాల్ థాక్రే ఎపుడూ పదవులు కోరుకోలేదు. వెనక నుంచే కధ నడిపించారు. కానీ ఉద్ధవ్ ఠాక్రేకు పదవుల మీద వ్యామోహం పెరిగి అది చివరికి శివసేన పుట్టె ముంచబోతోంది. శివసేన మూల సిద్ధాంత కఠిన హిందూత్వ. ఆ విషయంలో బీజేపీ కూడా పోటీ పడలేదు. కానీ పదవుల కోసం ఆయన బీజేపీతో బేరమాడి చివరికి కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకుని మూల సిద్ధాంతాలనే మంటగలిపారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవి దక్కినా  శివసేన పునాదులు మాత్రం కొట్టుకుపోయాయి. రెండున్నరేళ్ళుగా సీఎం గా ఉన్న ఉద్ధవ్ థాక్రేకి ప్రభుత్వం మీద పట్టు ఎంతవరకూ ఉందో తెలియదు, శరద్ పవార్ మొత్తానికి చక్రం తిప్పుతారు అని అంటారు. అదే టైమ్ లో తాత్కాలిక పదవుల కోసం శివసేన అస్థిత్వాన్ని ఆయన ఆహుతి చేశారు అన్న ఆవేదన ఆక్రోశం అసలైన శివసైనికులకు ఉంది. అది మెల్లగా మొదలై ఇపుడు తిరుగుబాటు దశకు చేరుకుంది.

ఈసారి శివసేనలో భారీ చీలిక వచ్చింది. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు షిండే నాయకత్వాన వేరు కుంపటి పెట్టారు. అంతకు ముందు వారే రాజ్యసభ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేశారు. అంటే వారు రూటే సెపరేట్ అని తెలుస్తోంది. ఈ క్రమంలో శివసేన వెనక్కి వెళ్ళిన వారిని తిరిగి తెచ్చుకుంటేనే సర్కార్ నిలుస్తుంది. అలా అనుకుంటే వ్రతం చెడినా ఫలితం దక్కుతుంది. మరో కొన్నేళ్ల పాటు ముఖ్యమంత్రి కుర్చీలో ఉద్ధవ్ థాక్రే కూర్చోగలుగుతారు.

అది జరగకపోతే మాత్రం ఒకేసారి  సీఎం కుర్చీతో పాటు శివసేన పార్టీకి కూడా ముప్పు ఉంటుంది. సిద్ధాంతాలను మంటగలిపేసిన శివసేన ఇపుడు జనంలోకి వెళ్ళే అర్హత కోల్పోయింది. శివసేన హార్డ్ కోర్ హిందూత్వ ప్లేసెస్ లో కూడా బీజేపీ చొచ్చుకుపోతున్న వేళ మొత్తానికి మొత్తం మహారాష్ట్రలో ఫ్యూచర్ లో బీజేపీ ఒంటి చేత్త్తో గెలిచి సొంతంగా మెజారిటీని సాధించే దిశగా అడుగులు వేస్తోంది. మొత్తానికి రాజకీయ విషాదం ఏంటి అంటే ఈ టోటల్ ఎపిసోడ్ లో శివసేన అనబడే అతి పురాతన ప్రాంతీయ పార్టీని బీజేపీ మింగేయబోతోంది అని.
Tags:    

Similar News