టాప్ 25 ఎమ్మెల్యేల సక్సెస్ సీక్రెట్స్ ఇవేనండి..

Update: 2016-07-26 08:10 GMT
ఎన్నికల వేళకు కాస్త అటూఇటూగా సర్వేలు చేయించటం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జమానా ముచ్చట. ఇప్పుడు కాలం మారిపోయింది. ఫారిన్ లో చక్కర్లు కొట్టిన కేటీఆర్ లాంటి యువనేతలు మంత్రులుగా చెలరేగిపోతున్న డిజిటల్ యుగమిది. మరి.. ఇలాంటి కాలంలో ఎంత ఫాస్ట్ గా ఉండాలి. అందుకే.. యూత్ తో పోటీ పడేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు. పదేళ్లు విపక్ష నేతగా అనుభవించిన ఇబ్బందిని మరెప్పటికీ తన అనుభవంలోకి రాకుండా ఉండేందుకు ఆయన మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. వీలైనంతవరకూ ఎవరితోనూ ఘర్షణకు దిగకుండా.. వీలైనంతవరకూ మనసు దోచుకోవటమే లక్ష్యంగాఆయన వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. తన మాదిరే తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ పట్ల తపన పెరగాలన్న ఉద్దేశంతో ఆయన కొత్త కొత్త కార్యక్రమాలు షురూ చేశారు.

ఇందులో భాగంగా తరచూ ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. మంత్రులకు సంబంధించి వేర్వేరు సర్వేలు చేయించటం మొదలెట్టారు. ఈ మధ్యన ఎమ్మెల్యేలపై సర్వే చేపట్టిన ఆయన.. టాప్ 25లో నిలిచిన ఎమ్మెల్యేల లెక్క తేల్చారు. అదే సమయంలో ర్యాంకింగ్ లో అందరి కంటే ముందున్న ఎమ్మెల్యేలు.. కాస్త వెనుకబడిన ఎమ్మెల్యేలతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇలా మీటింగ్ ఏర్పాటు చేసి.. తాము టాప్25 లిస్ట్ లోకి ఎలా చేరుకున్న విషయాన్ని వివరించటంతోపాటు.. తమ సక్సెస్ సీక్రెట్స్ ను మిగిలిన ఎమ్మెల్యేలతో పంచుకుంటారు.

ఎందుకిలా అంటే దీనికో లెక్క లేకపోలేదు. తమదైన రీతిలో దూసుకెళుతున్న టాప్ ఎమ్మెల్యేలు తామేం చేస్తున్నామన్న విషయాన్ని చెబితే మిగిలిన ఎమ్మెల్యేలకు ఈ స్ఫూర్తితోతమ తీరును మార్చుకుంటారని.. అదే జరిగితే పార్టీలోని అందరూ నేతల ప్రజల మనసుల్ని దోచుకుంటారని భావిస్తున్నారు. బాబు ఆదేశాలకు తగ్గట్లే బెజవాడలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో టాప్ ఎమ్మెల్యేల జాబితాలో ఉన్న గద్దె రామ్మోహన్.. బోడే ప్రసాద్ లాంటివాళ్లు కొందరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాము తమ నియోజకవర్గ ప్రజల మనసుల్ని ఎలా దోచుకుంటామన్న విషయాన్ని చెప్పటంతోపాటు.. ఏమేం చేయాలన్న సూచనలుకూడా చెప్పినట్లుగా తెలుస్తోంది.

తమ్ముళ్ల సక్సెస్ సీక్రెట్స్ ఏమిటంటే..

= ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా విధిగా వెళ్లటం. వెళ్లటానికి వీలుకాకపోతే..తర్వాత అయినా గుర్తు పెట్టుకొని వారి ఇంటికి వెళ్లి మాట్లాడటం.

= ఉదయం నుంచి సాయంత్రం వరకూ నియోజకవర్గంలో వీలైనంతగా తిరగటం.

= ఏదైనా పని విషయంలో అధికారులు సహకరించకపోతే వారిపై ఆహాగ్రం వ్యక్తం చేయటానికి మించినతప్పు పని ఉండదు. ఎందుకంటే.. పంచాయితీ అధినేత వద్దకు వెళ్లిన తర్వాత అయినా.. ఆయన చివరకు ఆదేశాలు జారీ చేసిదే గొడవ పడిన అధికారులే. శృతి మించి చెలరేగిపోతే.. సదరు అధికారులతో పనులు చేయించుకునే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే అధికాలరుల మీద అరిచే కంటే వారితో మాట్లాడి..సీఎంతో చెప్పించుకొని పని పూర్తి చేయటానికి మించింది లేదు.

= పార్టీ సమావేశాలకు పక్కాగా హాజరు కావటం..కార్యకర్తలు చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినటం.

= కార్యకర్తలు.. చోటా నేతలతో మమేకం కావటం.

= ప్రతి ఒక్కరిని పేరు పెట్టేంత చనువుగా మాట్లాడటం.

= ఏ ఊరు వెళ్లినా పాతిక మంది కార్యకర్తల్ని పేరు పెట్టి పిలిచేంతగా చనువు తెచ్చుకోగలిగితే తిరుగు ఉండదు

= కార్యకర్తలు ఎవరు పిలిచినా వారి ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలకు వెళ్లటం.. వారి భుజం మీద చేయి వేసి.. వారికి క్లోజ్ గా ఉన్నట్లుగా మాట్లాడితే వారెంతో సంతోషపడటమే కాదు.. ఫంక్షన్ కు వచ్చిన వారందరి దృష్టిలోపడతారని.. ఇక అప్యాయంగా మాట్లాడితే వారికి కలిగే ఆనందం చాలా ఎక్కువని.. అది తమ పట్ల మరింత అభిమానంగా మారుతుంది.
Tags:    

Similar News