ఏపీ కోసం బోడే వినూత్న నిర‌స‌న చూశారా?

Update: 2018-02-08 11:26 GMT
మొన్న‌టి కేంద్ర బడ్జెట్ లో తెలుగు నేల‌కు ప్ర‌త్యేకించి ఏపీకి చెప్పుకోద‌గ్గ కేటాయింపులేమీ లేని వైనం ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను - రాజ‌కీయ పార్టీల‌ను నిజంగానే క‌ల‌చివేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక ప్ర‌జ‌ల త‌ర‌ఫున కేంద్రంపై పోరాడాల్సిన ప్ర‌జా ప్ర‌తినిధులు నిన్న‌టిదాకా నిద్ర న‌టించేసి ఇప్పుడే మేల్కొన్న‌ట్లుగా ఫోజు కొడుతూ నిర‌స‌న‌ల‌కు తెర తీశారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి ఇప్ప‌టికే నాలుగేళ్లు దాటిపోతోంది. ఈ నాలుగేళ్ల‌లో  న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారు ఏనాడూ ఏపీకి తీపి క‌బురు పంపిన దాఖ‌లా లేనే లేదు. అస‌లు ఏపీ అడ‌గ‌కుండా సింగిల్ పైసాను కూడా కేంద్రం విదిల్చిన దాఖ‌లా లేదు. అంతేనా... న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోయిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... డిల్లీ నుంచి పిడికెడు మ‌ట్టి - చెంబెడు నీళ్లు తెచ్చి ఇచ్చిపోయారు త‌ప్పించి.. రాజ‌ధాని నిర్మాణం కోసం అవ‌స‌ర‌మైన మేర నిధులు ఇవ్వ‌లేద‌నే చెప్పాలి. రాజ‌ధాని కోసం విదిల్చిన రూ.1,500 కోట్ల నిధుల‌ను కూడా ఏపీ స‌ర్కారు ప‌దే ప‌దే అడిగితే త‌ప్ప స్పందించ‌ని మోదీ స‌ర్కారు... ఇచ్చిన ఆ పాటి నిధుల‌కు కూడా యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్లు ఇస్తేనే మలివిడ‌త నిధులు ఇస్తామ‌ని చెబుతోంది. దీంతో అప్ప‌టికే అగ్గి మీద గుగ్గిలంగా ఏపీ ప్ర‌జ‌ల‌ ప‌రిస్థితి మార‌గా... మొన్న‌టి బ‌డ్జెట్‌లో ఏపీకి కేంద్రం మొండి చెయ్యి చూపించిన వైనం మ‌రింత‌గా ఆజ్యం పోసింద‌ని చెప్పాలి.

ఈ క్ర‌మంలో వైసీపీ - కాంగ్రెస్ పార్టీల ఎంపీలు కూడా ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం పోరు సాగిస్తూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికైనా గ‌ళం విప్ప‌కపోతే... ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అవుతామ‌న్న భావ‌న‌తో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఇచ్చిన‌ ఆదేశాల‌తో ఆ పార్టీ ఎంపీలు పార్ల‌మెంటు ఉభ‌య‌స‌భ‌ల్లో నిర‌స‌న‌లు కొన‌సాగిస్తున్నారు. ఇక మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్‌పై అన్ని ప‌క్షాలు నిర‌స‌న వ్య‌క్తం చేయ‌గా... సీపీఐ నేత‌లు ఏకంగా రాష్ట్ర బంద్‌ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ పిలుపున‌కు కాంగ్రెస్‌ - వైసీపీల‌తో పాటుగా అధికార పార్టీగా ఉన్న టీడీపీ కూడా మ‌ద్ద‌తు ప‌లక‌క త‌ప్ప‌లేదు. గ‌డ‌చిన నాలుగేళ్లుగా జ‌రుగుతున్న మోసం ఒక ఎత్తు అయితే... ఇప్పుడు బ‌డ్జెట్ లో జ‌రిగిన అన్యాయం మ‌రో ఎత్తుగా ప‌రిగ‌ణించిన టీడీపీ... నిరస‌న బాట ప‌ట్ట‌క త‌ప్ప‌లేద‌న్న భావ‌న వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సీపీఐ ఇచ్చిన పిలుపు మేర‌కు నేటి ఉద‌యం ఏపీ వ్యాప్తంగా బంద్ ప్రారంభం కాగా... స‌ద‌రు బంద్‌లో సీపీఐ నేత‌ల‌తో పాటుగా వైసీపీ - కాంగ్రెస్‌ - టీడీపీ నేత‌లు కూడా చాలా ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఇత‌ర పార్టీల నేత‌ల విష‌యం ఎలా ఉన్నా అధికార పార్టీగా ఉన్న టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు - ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు చేస్తున్న వినూత్న ఆందోళ‌న‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇందులో భాగంగా కృష్ణా జిల్లా విజ‌య‌వాడ‌కు అతి స‌మీపంలో ఉన్న పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా ఉన్న బోడె ప్ర‌సాద్‌... బంద్‌ లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఉయ్యూరులో నేటి ఉద‌య‌మే రోడ్డు మీద‌కు వ‌చ్చేసిన బోడె... న‌డిరోడ్డుపై కూర్చుని గుండు గీయించుకున్నారు. నాలుగేళ్లుగా బీజేపీ స‌ర్కారు ఏపీకి చేస్తున్న అన్యాయానికి నిర‌స‌న‌గానే తాను గుండు గీయించుకున్నాన‌ని, ఇప్ప‌టికైనా కేంద్రం క‌ళ్లు తెరిచి ఏపీకి న్యాయం చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇష్టారీత‌న‌ విభజన చేసి, ఏపీ ప్రజలకు నిలువ నీడ లేకుండా...కట్టుబట్టలతో బయటకు నెట్టేసిందని, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ఆయ‌న‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు ప్రధాని మోదీకి తాకాలనే ఉద్దేశంతో తాను ఈ వినూత్న నిర‌స‌న‌కు దిగాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.
Tags:    

Similar News