ఐఎస్ ఘాతుకం..స్వ‌దేశానికి చేరిన 38 మృత‌దేహాలు!

Update: 2018-04-02 13:47 GMT
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల చెర‌లో బందీలుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన 38 మంది భారతీయుల మృత‌దేహాలు నేడు భార‌త్ కు త‌ర‌లించారు. ప్రత్యేక విమానంలో వారి మృతదేహాలను పంజాబ్‌లోని అమృత్‌సర్ కు తీసుకువ‌చ్చారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ... భార‌తీయ వైమానిక ద‌ళానికి చెందిన ప్ర‌త్యేక‌ విమానంలో ఇరాక్ లోని మోసుల్‌ ప్రాంతానికి వెళ్లి ఆ మృత‌దేహాల‌ను తీసుకువ‌చ్చారు. భారతీయుల మృతదేహాలను గుర్తించేందుకు ఇరాక్ ఫోరెన్సిక్ లాబొరేటరీలు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాయి. ఆ లేబొరేట‌రీల‌కు వీకే సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ ప‌రీక్ష‌ల ప్ర‌కారం 38 మంది మృతుల్లో పంజాబ్ వాసులే అత్యధికంగా 27 మంది ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌ నుంచి నలుగురు, పశ్చిమ బెంగాల్ నుంచి ముగ్గురు, బీహార్ నుంచి నలుగురు మృతిచెందిన వారిలో ఉన్నారు. దీంతో, పంజాబ్ కు చెందిన‌ మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం క‌ల్పిస్తామ‌ని ఆ రాష్ట్ర మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు హామీ ఇచ్చారు. బందీలుగా ఉన్న 38 మంది చ‌నిపోయార‌ని గ‌త నెల‌లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ పార్లమెంటులో ప్రకటించిన విష‌యం తెలిసిందే.

మోసుల్‌ సమీపంలో ఓ ప్రాజెక్టులో ప‌నిచేసేందుకు 40 మంది భారతీయులు 2014లో ఇరాక్ వెళ్లారు. వారంతా త‌మ ప‌నులు ముగించుకొని మోసుల్‌ నుంచి తిరిగి వస్తుండగా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. అప్ప‌టినుంచి వారి జాడ కోసం భార‌త స‌ర్కార్ తీవ్రంగా ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకపోయింది. అయితే, కిడ్నాప్ కు గురైన వారిలో ఒకరైన హర్జిత్‌ మాసీ అనే వ్యక్తి ఉగ్ర‌ చెర నుంచి తప్పించుకున్నాడు. త‌న‌తోపాటు బందీలుగా ప‌ట్టుబ‌డ్డ భార‌తీయులను బాదుష్‌ సమీపంలోని ఎడారిలో ఉగ్ర‌వాదులు చంపినట్లు తెలిపాడు. అయితే, అత‌డు చెప్పిన సమాచారంపై భార‌త ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రుపుతున్న నేప‌థ్యంలో మోసుల్‌ నగరంలో సామూహిక సమాధులను అక్క‌డి అధికారులు గుర్తించారు. అందులో, బందీలుగా ఉన్న 38 మంది భారతీయులు కూడా ఉన్న‌ట్లు తేలింది. ఆ 38 మృత‌దేహాల‌కు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వ‌హించిన అనంత‌రం వారు చ‌నిపోయినట్లు పార్ల‌మెంటులో సుష్మ ప్ర‌క‌ట‌న చేశారు. ఎట్ట‌కేల‌కు వారి మృత‌దేహాల‌ను నేడు భార‌త్ కు చేరుకున్నాయి.
Tags:    

Similar News