బాబు చ‌రిత్ర‌హీనుడవుతారు!!

Update: 2016-09-14 09:30 GMT
పోల‌వ‌రం నిర్మాణ ప‌నుల‌ను ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు సంద‌ర్శించడం - అక్క‌డి ప‌నుల తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ బాబు తీరుపై మండిప‌డ్డారు. పోలవరం కాంట్రాక్ట్  త‌న‌కు న‌చ్చిన వారికి ద‌క్కించుకునేందుకు ఏపీ సీఎం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారనే చ‌ర్చ సాగుతోంద‌ని బొత్స విమ‌ర్శించారు. కేంద్రం పరిధిలోని ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందని బొత్స సూటిగా ప్ర‌శ్నించారు. పోలవరంపై ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలను ఎవరు పరిష్కరిస్తారని నిల‌దీశారు. టెండర్లు లేకుండానే పోలవరం సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని, ఈ ర‌కంగా పోలవరం మట్టి పనుల్లో 1800 కోట్ల దోపిడీ జరిగిందని బొత్స ఆరోపించారు. సీఎం స్థాయి వ్యక్తులు సబ్ కాంట్రాక్టులు డిసైడ్ చేయడం దారుణ‌మ‌ని  బొత్స  మండిప‌డ్డారు.

ఓటుకు నోటు కేసులో బాబు ముద్దాయి అనేది లోక‌మంతా తెలిసిన విష‌య‌మేన‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్యానించారు. ఆ కేసు నుంచి బయట పడటానికి రాష్ట్రాన్ని కుదవ పెట్టేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పదేళ్లు ఉండాల్సిన రాజధాని నుంచి ప‌రుగుప‌రుగున రావ‌డం, ప్ర‌త్యేక హోదా బ‌దులుగా ప్యాకేజీకి ప్యాక‌ప్ అయిపోవ‌డం వంటివ‌న్నీ ఇందులో భాగ‌మ‌ని అన్నారు. ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చ‌కుండా సొంత ప్ర‌యోజ‌నాలు చూసుకుంటున్న చంద్ర‌బాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతార‌ని మండిప‌డ్డారు. ప్రత్యేక హోదా సంజీవని కాకపోతే గతంలో 5 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని ఎందుకు అడిగారని బొత్స స‌త్య‌నారాయ‌ణ నిల‌దీశారు. చట్టంలోని అంశాలను ఎందుకు నీరుగారుస్తున్నారని ప్ర‌శ్నించారు. స్విస్ ఛాలెంజ్ మీద ప్రతిపక్షాలు చెబుతున్నది తప్పైతే సరైన వివరాలు ప్రభుత్వం బహిర్గత పరచాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

కేంద్రం పరిధిలోని పోలవరం ప్రాజెక్టును పట్టుబట్టి రాష్ట్రానికి తెచ్చుకుని… ప్రాజెక్ట్ బదిలీ అవగానే టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కంపెనీకి 1450 కోట్లు అదనంగా సమర్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  పోలవరంపై పెద్దపెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా కాపర్ డ్యాం కథను చెప్పడంపై బొత్స అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదో దురుద్దేశం ఉంటుందని విపక్షాలు అంటున్నాయి.
Tags:    

Similar News