సర్పంచుల జోక్యానికి బ్రేక్ ?

Update: 2022-04-18 07:30 GMT
ఉపాధి హామీ పనుల్లో  సర్పంచుల జోక్యానికి తొందర లోనే బ్రేకులు పడబోతోందా ? వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు అందటంలో బాగా ఆలస్యమవుతోంది. నిధులు కేంద్రమే ఇస్తున్నా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు సకాలంలో అందటంలేదు.

ఈ విషయాలన్నింటినీ దృష్టి లో పెట్టుకుని బిల్లుల చెల్లింపులో కేంద్రం  అవసరమైన మార్పులు చేర్పులు చేస్తోంది. దీని ప్రకారం ఉపాధి హామీ పథకంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లు ఇసుక, సిమెంటు, ఇనుము, కంకరను వాడుతారు.

పూర్తయిన పనులకు ఇంజనీర్లు లెక్కలు కట్టి పోర్టల్లో బిల్లులను అప్ లోడ్ చేస్తారు. ఆ మొత్తాలను కేంద్రం పరిశీలించి నిదులను డైరెక్టుగా కాంట్రాక్టర్ల ఖాతాల్లోకే జమచేస్తుంది. ఈ ప్రక్రియలో సర్పంచుల జోక్యానికి అవకాశమే లేదు. ఒకపుడు ఇంజనీర్లు తయారుచేసిన బిల్లులపై సర్పంచుల సంతకాలు చేయాల్సుండేది. కానీ కొత్తపద్దతిలో సర్పంచుల జోక్యం లేకుండా కేంద్రం కొత్తపద్దతిని రెడీచేస్తోంది.

కేంద్రం చేస్తున్న మార్పులు చేర్పుల కారణంగా అవసరమైన పనులను గుర్తించటం, పనుల నిర్మాణానికి అవసరమైన తీర్మానాలు చేసి ఇంజనీర్లకు పంపటం, పనులు పూర్తయిన తర్వాత పనులు పూర్తయినట్లు నిర్ధారించటం వరకే సర్పంచులు పరిమితం కానున్నారు. జాతీయ ఉపాధిహామీ పనుల అమలును కేంద్రం పూర్తిగా తన చేతుల్లోకి తీసేసుకుంది. ఇందుకు అవసరమైన నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ అవసరమైన పోర్టల్ ను తయారుచేసింది.

ఈ మొత్తం ప్రక్రియ కేంద్రం గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తుంది. కేంద్రం చేసిన కొత్త విధానం ద్వారా  గ్రామీణ ప్రాంతాల్లో పనులు వేగంగా జరుగుతాయని అనుకుంటున్నారు. ఎందుకంటే బిల్లుల చెల్లింపులో ఆలస్యం ఉండదుకాబట్టి కాంట్రాక్టర్లకు సకాలంలో చేతికి డబ్బులు వచ్చేస్తాయి.

ఎప్పుడైతే చేసిన పనులకు వెంటనే బిల్లులు అందుతాయో కాంట్రాక్టర్లు ఫుల్లు హ్యాపీగా ఉంటారు. సర్పంచుల ఖాతాల్లో డబ్బులుంటే ప్రభుత్వం తన అవసరాలకు మళ్ళించుకుంటోందనే ఆరోపణల నేపధ్యంలో కేంద్రం కొత్తగా మార్పులు చేస్తోంది. ఈ మార్పులు సక్రమంగా అమలైతే పనులు ఊపందుకోవటం ఖాయం.
Tags:    

Similar News