ఊపిరి పీల్చుకోండి.. కరోనా తగ్గుతోంది

Update: 2021-06-06 07:30 GMT
దేశంలో కరోనా ఉధృతి వేగంగా పడిపోతోంది. క్రమక్రమంగా మహమ్మారి నుంచి దేశ ప్రజలకు ఊరట లభిస్తోంది. గత 24 గంటల్లో  నమోదైన కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. యాక్టివ్ కేసుల లోడు తగ్గుదల కనిపించింది. తాజాగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15 లక్షల లోపు నమోదైంది. 14.8 లక్షల యాక్టివ్ కేసులున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

గరిష్ట స్థాయి కేసుల నుంచి తగ్గుదలలో ఇప్పుడు 60శాతం కేసుల తీవ్రత తగ్గిపోయింది. దేశంలో ఒక దశలో 37 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ నంబర్ 15 లక్షల్లోపు నమోదవుతూ ఉంది. రోజురోజుకు లక్షకు పైగా కేసులు ఇంకా నమోదవుతున్నాయి. టెస్టుల సంఖ్యతో పోలిస్తే పాజిటివిటీ రేటు బాగా తగ్గడం ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం ఆరు శాతంలోపు కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనా మరణాల సంఖ్య భారీగా తగ్గింది. ఒక్కరోజులో ఈ సంఖ్య 2241గా ఉంది.

*ఏపీకి కరోనా నుంచి విముక్తి
కరోనా నుంచి ఏపీ ప్రజలు కూడా విముక్తి పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత భారీగా తగ్గుతోంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఖాళీగా బెడ్స్ దర్శనమిస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ లాగా సెకండ్ వేవ్ కూడా ముగిసినట్టేనని భావిస్తున్నారు. ఈ సెకండ్ వేవ్ లో చాలా మంది ప్రాణాలు పోయి వేల మంది కోవిడ్ బారినపడడమే విషాదం నింపింది.

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ సమయంలో రోజుకు 20వేలకు పైగా కేసులు నమోదై ఆందోళన నెలకొంది. ఒకవైపు ఆక్సిజన్ బెడ్లు దొరక్క.. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల రోదన అంతా ఇంతాకాదు.. కుటుంబాలకు కుటుంబాలే కరోనా మహమ్మారికి బలి అయ్యాయి. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లల గోడు వర్ణనాతీతంగా మారింది.

శనివారానికి 58 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా బాధితులు కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం గొప్ప ఊరటగా చెప్పుకొవచ్చు. మరో 80 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య ఐదులోపే అని తెలుస్తోంది. 25 కోవిడ్ సంరక్షణ కేంద్రాల్లో బాధితులు అసలు లేరనే గణాంకాలు మనసును తేలికపరిచేవే.

ఏపీలో రెండు రోజులుగా సగటున 10వేల కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 1664 ఐసీయూ, 8186 ఆక్సిజన్ పడకలు ఖాళీగా ఉన్నాయి. 24 గంటల్లో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. శనివారం మధ్యాహ్నానికి 1174 ఐసీయూ, 8164 ఆక్సిజన్ పడకలు ఖాళీగా ఉన్నాయని సమాచారం. దీన్ని బట్టి కరోనా తీవ్రత బాగా తగ్గిపోయిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. థర్డ్ వేవ్ ను ముందే ప్రజలు, ప్రభుత్వాలు అరికట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News