బ్రిటన్ లో బేబీ కార్న్ కూడా కొనలేకున్నారా?

Update: 2016-06-28 06:38 GMT
బ్రిటన్ అంటే ఏమిటి? డబ్బులున్న పార్టీ. ఆ దేశంలో ఉన్న వారెంత సంపన్నులో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలా అని.. ఆ దేశంలో పేదోళ్లు ఉండరా? అంటే.. ఉంటారు. కానీ.. మన దగ్గర పేదోళ్లకి.. వాళ్లకు మధ్య వ్యత్యాసం చాలానే ఉంటుంది. అక్కడి జీవన ప్రమాణాలు.. అక్కడి ఖర్చులు లెక్క వేస్తే ఇక్కడి ఎగువ మధ్యతరగతి జీవి సైతం వామ్మో అనుకునే పరిస్థితి.

మరి అలాంటి సంపన్న దేశంలో నిత్యవసరాలైన బెండకాయలు.. బేబీ కార్న్.. మిరపకాయులు.. మామిడి కాయలుకొనే విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చిందా? అంటే అవుననే చెప్పాలి. డబ్బులకు ఏ మాత్రం ఢోకా లేని దేశంలో కూరగాయలు.. పండ్లు కొనుక్కునే విషయంలో లెక్కలేసుకునే దరిద్రపు పరిస్థితి వచ్చేసింది. ఎందుకిలా అంటే.. బ్రెగ్జిట్ పుణ్యమా అని దారుణంగా దెబ్బ తిన్న అక్కడి కరెన్సీ పౌండ్ పుణ్యమా అని ఇలాంటి దుస్థితి చోటుచేసుకుందని చెప్పాలి.

బెండకాయలు.. బేబీ కార్న్.. పచ్చి మిర్చి.. మామిడికాయలు లాంటి వాటిని బ్రిటీషర్లు పెద్దగా వాడనప్పటికీ.. అక్కడే స్థిరపడిన ప్రవాస భారతీయులు వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. తాజా పరిస్థితుల్లో పౌండ్ విలువ భారీగా పతనం కావటంతో.. వీటిని తిని బతికే పలువురు భారతీయులు ఇప్పుడు ఆచితూచి.. లెక్కలేసుకొని బతుకుబండి లాగాల్సిన దుస్థితి. దేశ ఆర్థిక అనిశ్చితి పెరిగిపోవటంతో ఖర్చు విషయంలో ఆచితూచి అడుగులేస్తుంటారు.

బ్రిటన్లో స్థిరపడిన దక్షిణాసియా ప్రజలు.. కూరగాయలు.. పండ్లు లాంటి వాటి ధరల విషయాన్ని లైట్ తీసుకుంటారు. నిజానికి వాటిని వారు పెద్దగా పట్టించుకోరు. కానీ.. తాజా పరిణామాల నేపథ్యంలో వీటి ధరలు ఒక్కసారిగా పదిశాతానికి మించి పెరగటంతో వారు ఒక్కసారి అలెర్ట్ అయిన పరిస్థితి. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు రావాలంటే.. ఎగుమతి సుంకం విషయంలో మార్పులు చేసి.. వాటిని తగ్గించినపక్షంలో కూరగాయలు.. పండ్ల ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు. చూస్తూ.. చూస్తూ.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని బ్రిటన్ ప్రభుత్వం వదులుకోవటానికి సిద్ధమవుతుందా? అన్నది మరో ప్రశ్నగా చెప్పొచ్చు. ఏమైనా.. బ్రెగ్జిట్ కారణంగా.. గతంలో ఉన్నటువంటి భరోసా పరిస్థితి లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. చేతులారా కొని తెచ్చుకోవటం బ్రిటీషర్లకు మాత్రమే చెల్లుతుందేమో..?
Tags:    

Similar News