కొడుకు శవం ఇచ్చేందుకు లంచం.. బిక్షమెత్తుకున్న తల్లిదండ్రులు

Update: 2022-06-10 00:30 GMT
మన దేశంలో అడుగడుగునా లంచం.. బర్త్ సర్టిఫికెట్కు లంచం..డెత్ సర్టిఫికెట్కు లంచం.. మనిషి పుట్టిన దగ్గరి నుంచి చచ్చే దాకా లంచం.. లంచం..లంచం.. అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఏ పనైనా చేయాలంటే లంచం అడుగుతూ సామాన్యులను  బతికుండగా ఎలాగూ పీక్కుని తింటున్నారు. కానీ బిహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్‌లో మాత్రం చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కన్నవాళ్లకు అప్పజెప్పడానికి కూడా లంచం అడిగిన ఘటన చోటుచేసుకుంది.

కొద్ది రోజులుగా కుమారుడు కనిపించకుండా పోయాడు. అతడి కోసం ఆ కన్నవాళ్లు రోజుల తరబడి వెతికారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఎక్కడ చూసినా ఆచూకీ దొరకకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అతడి కోసం వెతకడం మొదలు పెట్టారు. ఇటీవలే అతడు చనిపోయినట్లు ఓ ఆస్పత్రి నుంచి ఫోన్ రాగా అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

తమ కుమారుడు చనిపోయినట్లు తెలిసి ఆ కన్నవాళ్లు ఆ ఆస్పత్రికి పరుగుపరుగున వెళ్లారు. ఇంట్లో నుంచి వెళ్లిన కొడుకు అలా కళ్లముందే నిర్జీవంగా పడి ఉండటం చూసి గుండెలవిసేలా రోదించారు. అనంతరం తమ బిడ్డను ఇంటికి తీసుకెళ్లి కడసారి వీడ్కోలు చెప్పి.. దహనసంస్కారాలు చేయాలనుకున్నారు. ఆస్పత్రి సిబ్బందిని తమ కుమారుడి మృతదేహం ఇవ్వమని కోరారు.

ఓవైపు కన్నబిడ్డను కోల్పోయి కుమిలిపోతున్న తల్లిదండ్రుల పట్ల కనికరం చూపించాల్సిన ఆస్పత్రి సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. కొడుకు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కన్నవాళ్లకు వారి బిడ్డ మృతదేహం ఇవ్వాలంటే.. రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత సొమ్ము అప్పటికప్పుడు అప్పజెప్పలేని ఆ పేద తల్లిదండ్రులు తమ కొడుకుకు కడసారిగా కన్నీటి వీడ్కోలు చెప్పడానికి నిశ్చయించుకుని ఆస్పత్రి సిబ్బందికి ఇవ్వాల్సిన రూ.50 వేల కోసం వీధివీధి తిరుగుతూ బిక్షమెత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో  ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

''నా కుమారుడు కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. అతడు చనిపోయాడని, సమస్తిపూర్‌లోని సర్దార్‌ ఆసుపత్రిలో మృతదేహం ఉంది.. వచ్చి తీసుకెళ్లాలని నాకు ఇటీవల ఫోన్ కాల్‌ వచ్చింది. ఆసుపత్రికి వెళ్తే.. రూ.50వేలు ఇస్తేనే శవాన్ని అప్పగిస్తామని చెప్పారు. మేం చాలా పేద వాళ్లం. అంతమొత్తం ఎక్కడినుంచి తెచ్చేది..''అంటూ మృతుడి తండ్రి మహేశ్‌ ఠాకూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఆస్పత్రిలో చాలా వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులే పని చేస్తున్నారు. కొన్ని రోజులుగా వారికి జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో ఇలా రోగుల కుటుంబాల నుంచి డబ్బులు వసూల్ చేస్తున్నట్లు స్థానిక పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.

ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. ఇది అమానవీయ ఘటన అని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా అదనపు మెజిస్ట్రేట్‌ వినయ్‌ కుమార్‌ రాయ్‌ తెలిపారు. అయితే , మహేశ్ కుమారుడి మృతదేహం పోలీసు కస్టడీలో ఉందని, అందువల్లే అప్పగించడం సాధ్యం కాలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News