ఈ బ‌స్సు డ్రైవ‌ర్ 50 మందిని కాపాడారు

Update: 2016-02-12 08:08 GMT
మ‌నుషులంటే గౌర‌వం - స‌మాజం అంటే ప్రేమ‌, ఇత‌రుల‌కు ఆనందం పంచ‌డంలో తృప్తి పొంద‌డం...ఇవి ఒక‌ప్ప‌టి మాట‌లు అనే ప‌రిస్థితులు వచ్చేశాయి. స‌ర్వం స్వార్థం నిండిపోయి ఎదుటివారు ఏమైపోయిన ప‌ర్లేదు కానీ తాను మాత్రం సేఫ్‌గా, హ్యాపీగా ఉండాల‌నుకునే దునియా ఇది! కానీ త‌న ప్రాణాలు పోయిన ఇత‌రులు బాగుండాల‌ని ఆకాంక్షించాడు ఓ డ్రైవ‌ర్‌. ఏకంగా 50 మందికి పున‌ర్జ‌న్మ ఇచ్చాడు. మాన‌వ‌త్వం ఉంద‌ని చాటుకునే ఈ సంఘ‌ట‌న మ‌న పొరుగు రాష్ట్రం త‌మిళ‌నాడులో జ‌రిగింది.

త‌మిళ‌నాడులోని కోయంబేడు నుంచి కాంచీపురానికి 50 మంది ప్రయాణికులతో ప్రభుత్వ బస్సు బయలుదేరింది. ఈ బస్సును సర్వేశ్వరన్ అనే డ్రైవ‌ర్ న‌డిపిస్తున్నారు. మధురవాయల్ అనే ప్రాంతంలోని మార్కెట్‌ కు ఈ బస్సు సమీపిస్తుండగా హఠాత్తుగా సర్వేశ్వరన్‌ కు గుండెలో క‌ల‌క‌లం ప్రారంభమ‌యింది. గుండెనొప్పిగా నిర్దారించుకున్న స‌ర్వేశ్వ‌ర‌న్ రాబోయే ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్టారు. త‌న ప్రాణం ఎంత ముఖ్యమో...ప్ర‌యాణికుల ప్రాణం అంత‌కంటే ముఖ్య‌మని భావించి బస్సును వెంట‌నే రోడ్డుపక్కకు ఆపివేశారు. బ‌స్సు దిగి సమీపంలో ఉన్న‌ ఓ ప్రైవేటు ఆస్పత్రికి నడిచి వెళ్లారు. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆస్పత్రి ప్రవేశద్వారం వద్దకు చేరుకున్న స‌మ‌యంలోనే ఆయ‌న స్పృహ కోల్పోయారు. అక్క‌డే ప‌డిపోయిన స‌ర్వేశ్వ‌ర‌న్‌ ను ఆస్ప‌త్రిలోకి తీసుకువెళ్లి పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో ఆయ‌న మరణించినట్టు నిర్ధారించారు.

స‌ర్వేశ్వ‌ర‌న్‌ కు గుండెపోటు రావ‌డం, ఆయ‌న ఆస్ప‌త్రికి వెళ్లేలోగానే మ‌ర‌ణించ‌డం తెలిసి ఆయ‌న న‌డిపించిన‌ బస్సులో ఉన్న ప్రయాణీకులు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యారు. గుండెపోటును లైట్ తీసుకొని అలాగే బస్సు నడుపుకుంటూ పోతే తాము మ‌ర‌ణించేవార‌మ‌ని ఆ 50 మంది ప్రయాణికులు ఆవేద‌న చెందారు. ప్రాణాలు పోతున్నాయ‌ని తెలిసిన‌ సమయంలో కూడా మాన‌వ‌త్వాన్ని చాటుకొని ప్రయాణికుల ప్రాణాల‌ను కాపాడార‌ని వారు వేనోళ్ల కొనియాడారు. స‌ర్వేశ్వ‌ర‌న్ నిజంగా ఆ స‌ర్వేశ్వ‌రుడి రూపంలోనే త‌మ‌ను ర‌క్షించార‌ని అభినందించారు. డ్రైవ‌ర్ స‌ర్వేశ్వ‌ర‌న్ మృతి విష‌యం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నఆయ‌న కుటుంబ సభ్యులకు మృత‌దేహాన్ని అంద‌జేశారు.
Tags:    

Similar News